Health

చెత్తకుప్పల్లోకి కోవిద్ ఔషధాలు

COVID Medications Dumped Due To No Demand

కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, ఈ వ్యాధి చికిత్సలో వినియోగించిన ఔషధాల అమ్మకాలు బాగా తగ్గుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారికి ఉపశమనం కల్పించేందుకు పలు రకాల ఔషధాలను వైద్యులు సిఫారసు చేశారు. అప్పటికే మార్కెట్లో ఉన్న ఔషధాలు కొన్ని కాగా, మరికొన్ని కొత్తగా అందుబాటులోకి వచ్చినవి ఉన్నాయి. ఈ మందులు గత ఏడాది ద్వితీయార్థంలో భారీ అమ్మకాలు నమోదు చేయగా, ఇప్పుడు గిరాకీ బాగా తగ్గింది. ఫలితంగా ఇతర ఔషధ విభాగాలపై సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.

గత ఏడాది ప్రారంభంలో కొవిడ్‌-19 కేసులు బయట పడినపుడు, ఎలా ఎదుర్కొవాలో వైద్యులకు అర్థం కాలేదు. వ్యాధి లక్షణాలు, బాధితుల తీరుతెన్నులను పరిశీలించాక, బాధితులకు ఉపశమనం కలిగించే మందులు సిఫారసు చేయడం ప్రారంభించారు. జ్వరానికి వాడే పారాసెట్మాల్‌, యాంటీ-బయాటిక్‌ ఔషధాలు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. మలేరియా వ్యాధి చికిత్సలో వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) కొవిడ్‌-19 పై బాగా పనిచేస్తోందనే ప్రచారం జరగటంతో అప్పట్లో ఒక్కసారిగా ఈ మందుకు గిరాకీ ఏర్పడింది. విటమిన్‌ ట్యాబ్లెట్లు, పారాసైటిక్‌ ఇన్ఫెక్షన్లను అదుపు చేసే ఐవర్‌మెక్టిన్‌ మందుల వినియోగం కూడా పెరిగింది. ఈ మందులు ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల ఆదాయాలు ఒక్కసారిగా పెరిగాయి. వీటికి ఎంత గిరాకీ ఏర్పడిందంటే.. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం పారాసెట్మాల్‌, హెచ్‌సీక్యూ మందుల ఎగుమతిని నిషేధించింది కూడా.

కొంతకాలం తరవాత కొవిడ్‌-19 చికిత్సకే ప్రత్యేకించిన రెండు ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి ఫావిపిరవిర్‌ కాగా, మరొకటి రెమ్‌డెసివిర్‌. జపాన్‌లోని టయోమా కెమికల్స్‌కు చెందిన అవిగన్‌ అనే బ్రాండుకు ఫావిపిరవిర్‌ జనరిక్‌ ఔషధం. మనదేశంలో ముందుగా గ్లెన్‌మార్క్‌ ఫార్మా ప్రవేశపెట్టింది. తర్వాత సిప్లా, జైడస్‌, హెటిరోతో పాటు.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆప్టిమస్‌ వంటి పలు ఫార్మా కంపెనీలు ఈ మందును తక్కువ ధరలోనూ తయారు చేయటం ప్రారంభించాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ను సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో, మైలాన్‌ ఇండియా సరఫరా చేశాయి. ఈ ఔషధాలకు ఎంత గిరాకీ లభించించడంతో, బ్లాక్‌లో అమ్మారు కూడా. రెమ్‌డెసివిర్‌ కోసం బాధితులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మందులు తయారు చేసిన ఫార్మా కంపెనీలకు భారీ ఆదాయాలను నమోదు చేసే సానుకూలత లభించింది. కొవిడ్‌- 19 కొత్త కేసులు బాగా తక్కువగా ఉంటున్నందున, ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివర్‌ వినియోగం బాగా తగ్గినట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. గ్లెన్‌మార్క్‌ ఫార్మా, సిప్లా ఆదాయాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

* 2020 డిసెంబరుతో పోల్చితే, 2021 జనవరిలో రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌ అమ్మకాలు వరుసగా…. 62%, 47% శాతం తగ్గాయి.
* శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు సంబంధించిన మందుల అమ్మకాల్లోనూ క్షీణత కనిపిస్తోంది.
* ఐవర్‌మెక్టిన్‌, హెచ్‌సీక్యూ అమ్మకాలు అయితే కొవిడ్‌-19 కంటే ముందుస్థాయికి చేరుకుంటున్నాయి.
* వివిధ రకాల వైద్య ఉపకరణాల అమ్మకాలూ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. పల్స్‌ ఆక్సిమీటర్లు, ఆవిరి పట్టే పరికరాలు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్‌… వంటి ఉపకరణాల అమ్మకాలూ తగ్గాయని విక్రయదార్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో దేశీయ ఫార్మా కంపెనీలు ఇతర ఔషధ విభాగాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జీవనశైలి వ్యాధుల విభాగంలో కొత్త మందులు తీసుకురావటం ద్వారా ఆదాయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేన్సర్‌ చికిత్సల కోసం రోగులు మళ్లీ ఆస్పత్రులకు వస్తుండటంతో ఆ మందుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నేత్రవైద్య చికిత్సలు, గ్యాస్ట్రో వ్యాధుల చికిత్సల కోసమూ బాధితులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఫలితంగా ఆయా విభాగాల మందుల అమ్మకాలు పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.