Politics

రఘురామపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్

High Court Green Signals CBI Probe Into Raghurama Krishnam Raju

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఇండ్‌–భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కుమార్తె కె.ఇందిరా ప్రియదర్శినిపై బ్యాంకులను మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలన్న ఆర్‌బీఐ సర్క్యులర్‌ నేపథ్యంలో తమ కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఇండ్‌–భారత్‌తోపాటు, రాజు, ఆయన భార్య, కుమార్తె దాఖలు చేసుకున్న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. సదరు కంపెనీలకు నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ తీసుకోకుం డా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. ఈ ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తునకు అడ్డుకావని స్పష్టం చేసింది. రుణంగా తీసుకున్న రూ.30.94 కోట్లు చెల్లించకపోవడంతో ఎస్‌బీఎస్, ఐఓబీ, యాక్సిస్, సిండికేట్, ఇండియన్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్, బరోడా బ్యాంక్‌.. ఇండ్‌–భారత్‌ కంపెనీ బ్యాం కు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాయి. మరో కేసులో ఆర్‌బీఐ సర్క్యులర్‌ను తప్పుబడుతూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైందని తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను జూలై 16 కి వాయిదా వేసింది.