Fashion

ఈ అంతర్జాతీయ బాక్సర్ వెనుక ఉన్న శక్తి…”అమ్మ”

ఈ అంతర్జాతీయ బాక్సర్ వెనుక ఉన్న శక్తి…”అమ్మ”

అసోంలోని డెకాయ్‌జులీ మా సొంతూరు. ఇదెంత కుగ్రామం అంటే మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియనంత వెనుకబడిన గ్రామం. అలాంటి ఊర్లో అందరి కంటే పేద కుటుంబం ఎవరిదంటే మా ఇంటివైపే చూపిస్తారు గ్రామస్థులు. నాకు ఊహ తెలిసేటప్పటికే నాన్న చనిపోయారు. ఒకేఒక్క ఇరుకు గదిలో ముగ్గురు పిల్లలతో సంసారాన్ని నడిపేది అమ్మ. కుటుంబాన్ని పోషించడానికి పొద్దస్తమాను కాయగూరలు అమ్మేది. ఉదయం ఆరింటికి కాయగూరల గంప నెత్తిన పెట్టుకుని వెళ్తే సాయంత్రం ఎనిమిదింటికి ఇంటికి వచ్చేది. కొన్నిసార్లు తనని చూడకుండానే నిద్రపోయేదాన్ని. మేమంతా బాగా చదువుకోవాలని అమ్మ కోరిక. అందుకే ఎంతో కష్టపడి డబ్బుని మా చదువులకోసం దాచేది. బడికి వెళ్తున్న నాకు ఓరోజు చాలామంది బాక్సింగ్‌ మాదిరిగా ఉండే ఉషూ నేర్చుకుంటూ కనిపించారు. బడి మానేసి నేను కూడా వాళ్లతో చేరిపోయాను. ఆ ఆట నాకు నచ్చింది. చాలారోజులు బడి మానేసి వాళ్లకు చిన్నచిన్న సాయాలు చేసేదాన్ని. ఈ విషయం అమ్మకు తెలిసింది. మీ అమ్మాయిని ఉషూలో చేర్పించవచ్చు కదా అని బృందంలో ఒకరు అడిగితే ‘ఏది ఓసారి గెలిచి చూపించమనండి. గెలిస్తే మీరు అడిగినట్టుగానే ఆడనిస్తా’ అంది. అమ్మకోసం ఆ క్రీడ నేర్చుకుని జోనల్‌ స్థాయిలో గెలిచి బంగారు పతకం గెల్చుకున్నా. దాంతో అమ్మ బాక్సింగ్‌, ఉషూ నేర్చుకోవడానికి అనుమతిచ్చింది. తన దగ్గర డబ్బు లేకపోయినా నాకు మాత్రం ఏ లోటు రానివ్వలేదు. శాయ్‌ రీజనల్‌ సెంటర్‌ గువహటిలో నాకు బాక్సింగ్‌ నేర్చుకోవడానికి అవకాశం వచ్చిన తర్వాతే మా పరిస్థితులు కొంత చక్కబడ్డాయి. అప్పటికీ తను సంపాదించిన దానిలో కొంతమొత్తం నాకు పాకెట్‌మనీగా పంపిస్తూనే ఉంది అమ్మ. మేరీకోమ్‌ నా రోల్‌మోడల్‌. ఆమెతో కలిసి శిక్షణ తీసుకోవడాన్ని గొప్పగా భావించా. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాను. ఆ తర్వాత చేతులకు గాయాలు కావడంతో తప్పనిసరై సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. ఆటమానేద్దామని అనుకున్నా… నాకన్నా వయసులో పెద్దదైన మేరీకోమ్‌ ఇంకా పోరాడుతూనే ఉన్నప్పుడు నేనెందుకు ఆటని వదులుకోవాలని అనిపించింది. అందుకే మునుపటి స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నా అంటోంది జమున.