Agriculture

గాంగీనా పద్ధతిలో తాజాగా పండ్లు

Afghani Gangina Method To Preserve Fruits And Veggies

పండ్లు, కూరగాయలు వంటివి తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవడానికి తప్పనిసరిగా ఫ్రిజ్‌ వాడుతుంటాం. అఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో పండ్లు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్‌లపై ఏమాత్రం ఆధారపడరు. ద్రాక్ష వంటి పండ్లను ఆరునెలల పాటు చెక్కుచెదరకుండా నిల్వ చేసుకోవడానికి వారు పురాతనమైన సంప్రదాయ పద్ధతినే నేటికీ నమ్ముకుంటున్నారు. ఎలాంటి పండ్లనైనా ఆరునెలల పాటు తాజాదనం చెక్కుచెదరకుండా నిల్వచేసే ఈ ప్రక్రియ పేరు ‘గాంగినా’. ఈ పద్ధతిలో తడి బంకమట్టితో బుట్టల్లాంటివి తయారు చేసి, వాటిలో తాజా పండ్లు ఉంచి, గాలి చొరబడే అవకాశం లేకుండా వాటిని మూసివేస్తారు.వి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెడతారు. ఎండిన బుట్టలను చీకటి గదుల్లో నిల్వ ఉంచుతారు. పండ్ల దిగుబడి లేని రుతువులో ఈ ‘గాంగినా‘ బుట్టలను తెరిచి, ఇందులోని పండ్లను వాడుకుంటారు. ‘గాంగినా’ బుట్టలను తయారు చేసేటప్పుడు వీటి అడుగు భాగాన్ని, పైమూతను రెండేసి పొరలుగా మట్టితో తయారు చేయడం వల్ల వీటిలో భద్రపరచిన పండ్లు చిరకాలం తాజాగా ఉంటాయి. వీటిలో పండ్లను నిల్వ చేసేటప్పుడు, ముందుగా అతిగా ముగ్గిన వాటిని, కుళ్లిన వాటిని వేరు చేసేస్తామని, లేకుంటే మొత్తం పండ్లు పాడైపోతాయని అబ్దుల్‌ మానన్‌ అనే రైతు చెప్పారు.