Business

అతి చౌక విద్యుత్ వాహనం ఇది-వాణిజ్యం

DETEL Releases The World's Most Cheapest Two Wheeler

* వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మధ్య ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు విషయంలో ఆసక్తి చూపుతున్నారు. చాలా వరకు కంపెనీలు కూడా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ముంబయిలో జరిగిన “ఇండియా ఆటో షో 2021″లో ప్రపంచంలోని అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం “డిటెల్ ఈజీ ప్లస్”ను డిటెల్ ఆవిష్కరించింది. 2021 ఏప్రిల్‌లో రోడ్డు మీదకు రానున్న ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మన భారత రోడ్లకు సరిగ్గా సరిపోతుందని కంపెనీ పేర్కొంది. ద్విచక్ర వాహనం 4 రంగుల్లో అంటే ఎల్లో, రెడ్, రాయల్ బ్లూ, టీ బ్లూలో లభిస్తుంది.

* మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి పది కంపెనీల్లో ఏడింటి విలువ గతవారం గణనీయంగా వృద్ధి చెందింది. గడిచిన వారం రోజుల్లో ఈ ఏడు కంపెనీల మార్కెట్ విలువ రూ.1,40,430.43 కోట్లు పెరగడం గమనార్హం. మార్కెట్ల జోరుతో లాభపడ్డ షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ముందువరుసలో ఉండగా.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ల మార్కెట్‌ విలువ తగ్గడం గమనార్హం. గతవారం సెన్సెక్స్‌ 812.67 పాయింట్లు ఎగబాకిన విషయం తెలిసిందే.

* దాఖలు చేసిన జీఎస్టీ విక్రయాల రిటర్నుల్లో లేదా జీఎస్‌టీఆర్‌-1ఫారమ్‌లో ఏమైనా తేడా లేదా అవకతవకలు ఉంటే వెంటనే అధికారులు రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేస్తారు. వారి సరఫరాదారుల రిటర్నులతో పోల్చిచూస్తే ఎటువంటి తేడాలు ఉండ కూడదు. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ ‘స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌’ను జారీ చేసింది.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్‌ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్‌ ధర సెంచరీ చేరింది. యాడిటివ్స్‌తో కూడిన పెట్రోల్‌ (వాహన పనితీరు మెరుగుపర్చేందుకు పెట్రోల్‌లో రసాయనాలు కలుపుతారు) ధర రూ.100 దాటినట్లు పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడొకరు తెలిపారు. ఆదివారం ఉదయం పెట్రోల్‌ ధర మరో 28 పైసలు పెరగడంతో రిటైల్‌గా విక్రయించే పెట్రోల్‌ ధర రూ.100 దాటినట్లు పేర్కొన్నారు. సాధారణ పెట్రోల్‌ ధర రూ.97.38గా ఉందన్నారు.

* అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా ఏకీకృత ప్రాతిపదికన రూ.4,532.10 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2019లో ఇదే సమయంలో కంపెనీకి వచ్చిన రూ.6,438.80 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టం తగ్గింది. ఇండస్‌ టవర్స్‌లో వాటా విక్రయం కలిసిరావడం ఇందుకు కారణమైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.11,089.40 కోట్ల నుంచి 1.7 శాతం తగ్గి రూ.10,894 కోట్లకు పరిమితమైంది. ‘సమీక్షా త్రైమాసికంలో మా నిర్వహణ పనితీరు మెరుగైంది. మా నెట్‌వర్క్‌ను విడిచి పెట్టి వేరే నెట్‌వర్క్‌కు మారే చందాదార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నాం. వ్యూహాల అమలుపై దృష్టి సారించడాన్ని కొనసాగిస్తూనే, వ్యయ నియంత్రణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తామ’ని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

* టెక్‌ దిగ్గజం టెస్లా బెంగళూరులో విద్యుత్తు కార్ల తయారీ కర్మాగారం నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ రాయిటార్స్‌ కర్ణాటక ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ఈ మేరకు కథనం వెలువరించింది. అమెరికా సంస్థ టెస్లా కర్ణాటకలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. గత నెలలో టెస్లా బెంగళూరులో తన భారతీయ విభాగ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కూడా ఆర్‌వోసీ వద్ద చేయించింది.