NRI-NRT

చైనా టీకా…వాడకం తక్కువ. అమ్మకం ఎక్కువ.

చైనా టీకా…వాడకం తక్కువ. అమ్మకం ఎక్కువ.

కరోనా వైరస్‌కు మూలకారణమైన చైనా, వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీలోనూ విభిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో పంపిణీ చేస్తోన్న వ్యాక్సిన్‌ల కంటే ఇతర దేశాలకే ఎక్కువ డోసులను ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ నాలుగు కోట్ల డోసులను పంపిణీ చేయగా, నాలుగున్నర కోట్ల డోసులను ఎగుమతి చేసినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో, అన్ని దేశాలకంటే ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే, అత్యవసర వినియోగం కింద భారీ స్థాయిలో పంపిణీ చేసిన డ్రాగన్‌ దేశం, ఇప్పటివరకు 4కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఇది అమెరికా కన్నా తక్కువే కావడం విశేషం. అయితే, అంతకన్న ఎక్కువ (4.6కోట్ల) డోసులను విదేశాలకు పంపిణీ చేసినట్లు హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా ఉన్న సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాకుండా లక్షల సంఖ్యలో మరిన్ని డోసులను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషించింది. ప్రస్తుతం చైనాలో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతోన్న కారణంగా ఫిబ్రవరి 11 నుంచి 18వరకు వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.