Health

నకిలీ టీకాకు కేరాఫ్ అడ్రస్…చైనా

నకిలీ టీకాకు కేరాఫ్ అడ్రస్…చైనా

నకిలీలు, చౌకబారు వస్తువుల ఉత్పత్తికి చైనా మారుపేరు. ఇక మహమ్మారి కొవిడ్‌ మూలాలు ఇక్కడే ఉన్నాయనే అపకీర్తినీ ఈ దేశం మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో అనేక మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంభకోణానికి సూత్రధారి కూడా ఆ దేశంలోనే పట్టుబడటం గమనార్హం. కాంగ్‌ అనే పేరున్న ఈ ఘరానా మోసగాడు నిజమైన వ్యాక్సిన్ల ప్యాకేజింగ్‌, డిజైన్లను బాగా పరిశోధించాడు. అనంతరం ఏకంగా 58 వేల నకిలీ టీకా సమ్మేళనాలను సృష్టించాడు. టీకా ఔషధానికి బదులుగా మినరల్‌ వాటర్‌, సెలైన్‌ ద్రావణం ఆ సీసాల్లో నింపేవాడట. వీటిని సముద్రమార్గంలో విదేశాలకు స్మగ్లింగ్ చేసేవాడు. ఈ విధంగా గత ఆగస్టు నుంచి చేస్తున్నట్టు తెలిసింది. గత నవంబర్‌లో 600 బ్యాచ్‌ల నకిలీ వ్యాక్సిన్‌ను హాంకాంగ్‌కు పంపాడు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్‌ బృందం 2.78 మిలియన్ డాలర్లు ఆర్జించింది. కాగా, ఈసారి వాటిని ఎక్కడకు పంపాలనుకున్నదీ తెలియరాలేదు.