Politics

జగన్‌కు అవార్డు

Jagan Awarded With Skoch Award By Kocchar

సమర్థవంతమైన, పారదర్శక పాలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టిందని స్కోచ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ ప్రశంసించారు. ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంను కలిసిన ఆయన ‘స్కోచ్‌ ఈ ఏటి ముఖ్యమంత్రి’ అవార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాల అమలు, ఫలితాలపై ఏడాదిపాటు అధ్యయనం చేసిన తర్వాత.. సీఎం జగన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ‘మద్దతు ధరను ముందే ప్రకటించడంతో పాటు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు ఆసక్తికర నమూనాగా నిలుస్తుంది. దీని ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. మధ్య వయస్సు మహిళల ఆర్థిక సాధికారతకు వైస్సార్‌ చేయూత ద్వారా అందించే జీవనోపాధి రుణాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. మహిళల రక్షణ, భద్రతకు ఉద్దేశించిన దిశ, అభయ్‌ పథకాలు వారిలో విశ్వాసాన్ని నింపాయి…’ అని కొచ్చర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయని చెప్పారు. వివిధ రంగాల్లో 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.