Kids

అమ్మాయిలపై వివక్ష చూపే తల్లులు ఇది చదవాలి

తల్లీ కూతుళ్ల అనుబంధం చాలా అమూల్యమైంది. అమ్మకు ప్రతిరూపం కూతురు. ఆలోచనలు, అభిరుచులు… ఇలా అన్నింటిని అమ్మను చూసి నేర్చుకుంటుంది చిన్నారి. అలాగే తల్లిలో ఓ స్నేహితురాలిని వెతుక్కుంటుంది. అయితే ఒక్కోసారి ఈ అనుబంధంలో పొరపచ్చాలు రావొచ్చు. వాటిని ఆదిలోనే తుంచకుంటే రాన్రానూ వారి మధ్య దూరం పెరగొచ్చు. వయసుకు మించిన బాధ్యతలు… సాధారణంగా చాలామంది తల్లులు కూతుళ్లకు చిన్నప్పటి నుంచే బాధ్యతలు అప్పజెబుతుంటారు.. ఇది మంచి పద్ధతే కానీ… ‘రేపు అత్తారింటికి వెళ్లేదానివి కాబట్టి ఈ పనులన్నీ తప్పనిసరిగా నేర్చుకోవాలి’ అంటూ పదే పదే అమ్మాయిలకు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల వారు తమ బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా తల్లి మాటలకు బాధపడుతూ ఆమెకు దూరం కావొచ్చు కూడా. నమ్మకం లేకపోతే… తల్లిదండ్రులకు కూతురు గౌరవం, మర్యాద ఇవ్వాలని ఎలా కోరుకుంటామో, అమ్మగా అమ్మాయి పట్ల ప్రేమతోపాటు నమ్మకాన్ని కలిగి ఉండాలి. మాతృమూర్తిగా, మహిళగా మీరు మీ కూతుర్ని నమ్మలేకపోతే ఆమె మనోస్థైర్యం దెబ్బతింటుంది. దాంతో ఆమె క్రమంగా మీకు దూరంకావొచ్చు. అమ్మాయికి ఏది సరైందో, ఏది తప్పో అనే విచక్షణను తెలియజేయడం తల్లిగా మీ బాధ్యత. అంతే తప్ప ప్రతిసారి చిన్నారిని ఏదో ఒక విషయంలో తిడుతూ ఉంటే తను మానసికంగా మీకు దూరమవడం ఖాయం. తప్పులు వెతకొద్దు… కూతురు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. అలాగే ఇతరులతో పోల్చొద్దు. మీరిలా చేయడం వల్ల మీపై ఉండే అభిమానం కాస్త కోపంగా మారే ప్రమాదం ఉంది. ఇది మీ మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. వివక్ష వద్దు… అమ్మాయి, అబ్బాయి అంటూ వివక్ష చూపొద్దు. తేడా చూపడం వల్ల ‘అమ్మనాన్నలకు నేను ఇష్టం లేదేమో’ననే సందేహం ఆ చిన్నారి మనసులో మొదలై మానుగా మారుతుంది. కాబట్టి ఆడపిల్లైనా, మగపిల్లాడైనా… ఇద్దరినీ సమానంగా చూడాలి.