NRI-NRT

ఇతర దేశాలకు భారతీయ సంపన్నుల పరుగు

ఇతర దేశాలకు భారతీయ సంపన్నుల పరుగు

ప్రపంచం ఎన్ని సంక్షోభాలపాలవుతున్నా వాటిని అవకాశాలుగా మలచుకుని కోట్లకు పడగలెత్తే యుక్తిపరులకు కొదవ లేదు. భారత పౌరసత్వం వదులుకుని అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్న సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. డబ్బు ఇచ్చి మరీ వీరు ఆ దేశాల పౌరసత్వం కొనుక్కొంటున్నారు. 2015-’19 మధ్యకాలంలో ఏకంగా 6.76 లక్షలమంది భారతీయులు మన పౌరసత్వం వదులుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఇటీవల లోక్‌సభకు తెలిపారు. 2016లో 1.44 లక్షలమంది భారతీయులు స్వదేశ పౌరసత్వాన్ని వదులుకోగా, 2017లో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా పగ్గాలు చేపట్టాక ఇలాంటివారి సంఖ్య కొంత తగ్గి 1.27 లక్షలకు చేరింది. ట్రంప్‌ తరవాత జో బైడెన్‌ విధానాలు మళ్ళీ భారతీయుల వలసలను ప్రోత్సహించవచ్చు. పోనుపోను ఇలాంటి సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తికర పరిణామం. 10 లక్షల డాలర్లకు (7.4 కోట్ల రూపాయలకు) మించిన ఆస్తులు కలిగిన సంపన్నులను అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ)గా వర్గీకరిస్తారు. మూడు కోట్ల డాలర్లకు (దాదాపు రూ.220 కోట్లకు) మించిన నికర విలువ కలిగినవారిని అతి సంపన్నులు (యుహెచ్‌ఎన్‌ఐ)గా వర్గీకరిస్తున్నారు.

సంపన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ పౌరసత్వం కానీ, దీర్ఘకాల నివాస వసతి కానీ పొందాలనుకునేవారు కొవిడ్‌కు సైతం వెరవడం లేదు. ఈ రెండు రకాల అవకాశాల కోసం వాకబు చేసేవారి సంఖ్య 2019కన్నా 2020లో ఎక్కువైంది. భారత రాజ్యాంగం ఏక కాలంలో రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉండటాన్ని అనుమతించదు. కాబట్టి మన సంపన్నులు విదేశీ పౌరసత్వం కోసం భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2014-18 మధ్య 23,000 మంది హెచ్‌ఎన్‌ఐలు భారత్‌ విడిచివెళ్ళిపోయారని మోర్గన్‌ స్టాన్లీ సంస్థ వెల్లడించింది. 2019లో మొత్తం 7,000 మంది భారతీయ హెచ్‌ఎన్‌ఐలు విదేశీ పౌరసత్వాలు స్వీకరించారని న్యూవరల్డ్‌ వెల్త్‌ అనే సంస్థ చెబుతోంది. సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐ), అతి సంపన్నుల (యుహెచ్‌ఎన్‌ఐ) సంఖ్య ఏటేటా పెరిగిపోతున్న దేశాల్లో అమెరికా, జపాన్‌, చైనాల తరవాతి స్థానం భారతదేశానిదే. 2019లో ప్రపంచ యుహెచ్‌ఎన్‌ఐల జాబితా 31,000 మేరకు పెరిగి- 5,13,200కు చేరిందని నైట్‌ ఫ్రాంక్‌ అనే సంస్థ తెలిపింది. 2019లో భారత్‌లో 5,986 మంది యుహెచ్‌ఎన్‌ఐలు ఉండగా, 2024కల్లా వీరి సంఖ్య 10,354కు చేరుతుందనీ ఆ సంస్థ లెక్కగడుతోంది. స్వదేశం విడిచి విదేశాలకు వలసపోతున్న హెచ్‌ఎన్‌ఐలు భారత్‌లోనే ఎక్కువ. భారత పౌరసత్వం వదులుకోవడమనేది 2014 నుంచి ఎక్కువైంది.
భారత్‌లో ఆర్థిక మందగతి, 2014 నుంచి అమలులోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దు, నల్ల ధన నివారణకు చేసిన చట్టాలు హెచ్‌ఎన్‌ఐలను విదేశాలకు తరలిపోయేట్లు చేస్తున్నాయి. నేడు భారత్‌లో అత్యంత సంపన్నులపై గరిష్ఠ ఆదాయ పన్ను రేటు దాదాపు 43 శాతానికి చేరింది. దీంతో పన్ను రేటు బాగా తక్కువగా ఉండే దేశాల పౌరసత్వానికీ లేక అక్కడ దీర్ఘకాల నివాసానికీ మన హెచ్‌ఎన్‌ఐలు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు దుబాయ్‌లో ఆదాయ పన్ను, సర్వీస్‌ పన్నువంటివి లేవు. అదే మన దేశంలో ఆదాయపన్నుకు తోడు సర్‌ఛార్జీలు, సెస్సుల బెడద ఎక్కువ. కుటుంబంలో ఆస్తి తగాదాలు, రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలామందిని విదేశీ పౌరసత్వం కోసం వెంపర్లాడేలా చేస్తున్నాయి. మరోవంక అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐరోపా దేశాల్లోని ఉన్నత జీవన ప్రమాణాలు, విద్యావైద్య వసతులు హెచ్‌ఎన్‌ఐలను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. వీటికితోడు సంపన్న దేశాల్లోని వ్యాపార అవకాశాలు మన హెచ్‌ఎన్‌ఐలను, కంపెనీ అధిపతులనూ బాగా ఊరిస్తున్నాయి.

భారతీయ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వీసా రహిత రాకపోకలు సాగించే అవకాశాలు బాగా తక్కువ కాబట్టి, ఆ వసతి ఉండే దేశాల పౌరసత్వం పొందడానికి మన సంపన్నులు తహతహలాడుతున్నారు. భారతీయ పాస్‌ పోర్టు కేవలం 59 దేశాలకు వీసా రహిత రాకపోకల సౌకర్యం కల్పిస్తే, మాల్టా దేశ పాస్‌పోర్ట్‌తో 182, గ్రెనడా పాస్‌పోర్ట్‌తో 141 దేశాలకు వీసా లేకుండా పయనించవచ్చు. ఈ దేశాల వీసాలతో బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని 26 దేశాలకు స్వేచ్ఛగా వెళ్ళిరావచ్చు. దీనివల్ల ఈ సంపన్న దేశాల్లో హెచ్‌ఎన్‌ఐలకు సమృద్ధిగా వ్యాపారావకాశాలు లభిస్తాయి. హిందుజా సోదరుల వంటివారు చాలాకాలం క్రితమే బ్రిటిష్‌, స్విస్‌, సైప్రస్‌ పౌరసత్వాలు పొందగా- టాటాల భాగస్వామి అయిన షాపూర్జీ పలోన్జీ మిస్త్రీ ఒక ఐర్లాండ్‌ వనితను పెళ్లాడి భారతీయ పౌరసత్వం వదులుకుని ఐరిష్‌ పౌరుడిగా మారారు. ఆయన కుమారుడు సైరస్‌ మిస్త్రీ టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ అయ్యాక కూడా ఐరిష్‌ పౌరుడిగానే కొనసాగారు. విదేశాల్లో వ్యాపారం చేయడానికి అక్కడి పౌరసత్వం అక్కర్లేదని, దీర్ఘకాల నివాస వసతి ఉంటే చాలని చాలామంది కుబేరులు నిరూపించారు. ఉదాహరణకు లక్ష్మీ మిత్తల్‌ (బ్రిటన్‌), మిక్కీ జగ్తియానీ, సన్నీ వర్కీ (దుబాయ్‌), ఎంఏ యూసుఫ్‌ అలీ, షంషేర్‌ వయలిల్‌ (అబూ ధాబీ)లు భారత పౌరసత్వాన్ని వదులుకోకుండా విదేశాల్లో దీర్ఘకాలంగా వ్యాపారాలు వృద్ధిచేసుకుంటున్నారు. వేదాంత రిసోర్సెస్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ బ్రిటన్‌లో స్థిరపడినా ఇప్పటికీ భారతీయ పౌరుడే!