NRI-NRT

బైడెన్ బిల్లు బానే ఉంది గానీ….

బైడెన్ బిల్లు బానే ఉంది గానీ….

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న భారతీయులతో సహా పలువురు విదేశీయులకు ప్రయోజనం కలగనుంది. వీరిలో మరింత ఎక్కువ మందికి గ్రీన్‌కార్డులను మంజూరు చేసేందుకు వీలు కల్పించేలా ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లును ఆ దేశ చట్టసభలో ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ బాబ్‌ మెనెండేజ్‌, ప్రతినిధుల సభ సభ్యురాలు లిండా సాంచెజ్‌ ఈ బిల్లును గురువారం సభలో ప్రతిపాదించారు. అక్రమ విధానాల ద్వారా దేశంలో ప్రవేశించిన ఎనిమిదిన్నర లక్షల మంది చిన్నారులకు వలసదారులుగా గుర్తింపు కల్పించటం.. మరో 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం ఇవ్వటమే లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టినట్టు వారు వెల్లడించారు. కాగా, ఈ బిల్లు వల్ల భారతీయులకు కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లు చట్ట రూపం దాలిస్తే.. ప్రతి సంవత్సరం దేశాల వారీగా పరిమిత సంఖ్యలో మాత్రమే గ్రీన్‌కార్డులను మంజూరు చేయాలన్న నిబంధనకు ఉద్వాసన పలకనున్నారు. తద్వారా అమెరికాలో శాశ్వతంగా నివాసముండేందుకు వీలుకలిగించే గ్రీన్‌ కార్డు పొందేందుకు.. ఎంతోకాలంగా వేచిచూస్తున్న భారతీయ ఉద్యోగుల నిరీక్షణకు తెరపడుతుంది. భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన వారికి అగ్రరాజ్యంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. గ్రీన్‌ కార్డు గురించి వేచి చూసే అవసరం లేకుండా హెచ్‌1బీ వీసాదారుల కుటుంబ సభ్యులు తమవారిని చేరే అవకాశం కలుగుతుంది. హెచ్‌1బీ వీసాదారులు అమెరికాకు వలసవచ్చే సమయానికి వారి సంతానానికి 21 సంవత్సరాలు నిండితే ఇప్పటివరకు అనుమతించేవారు కాదు. ఇకపై ఈ నిబంధనకు సడలింపును ప్రతిపాదించారు. సదరు ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా ఉపాధి పొందేందుకు ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ఈ వెసులుబాటును ట్రంప్‌ ప్రభుత్వం గతంలో రద్దుచేసిన సంగతి తెలిసిందే.