Business

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ₹93.78-వాణిజ్యం

One Liter Petrol In Hyderabad Is 93.78 INR - Telugu Business News

* చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది.వరుసగా 11వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి.శుక్రవారం పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోలు ధర రూ.90 మార్కును దాటింది.పెంచిన ధరలతో అక్కడ లీటరు పెట్రోలు రూ.90.19, డీజిల్‌ ధర రూ.80.60కి చేరింది.వరుసగా 11 రోజుల్లో కలిపి లీటరు పెట్రోలుపై రూ.3.24, డీజిల్‌పై 3.47 చొప్పున పెరిగింది.హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.93.78కు చేరింది. డీజిల్‌ ధర రూ.87.91గా నమోదైంది.హైదరాబాద్‌లో ఈనెల 1వ తేదీన లీటరు పెట్రోలు ధర రూ.89.77, డీజిల్‌ రూ.83.46 ఉండగా ఇప్పటికి పెట్రోలుపై రూ.3.99, డీజిల్‌పై రూ.4.42 పెరిగింది.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అత్యధికంగా లీటర్‌ పెట్రోలు ధర రూ.96.62గా నమోదైంది.డీజిల్ ధర రూ.87.67గా ఉంది.

* తాత్కాలికంగా ఎదుర‌య్యే న‌గ‌దు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి బంగారు రుణాలు సహాయపడతాయి. ఈ రుణాలు త్వ‌ర‌గా పొందొచ్చు. బంగారంపై రుణాల‌ను జారీచేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కోర్‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవు. ఇటువంటి రుణాలు చిన్న వ్యాపార యజమానులకు తాత్కాలిక నగదు సమస్యల‌కు లేదా అత్యవసర డబ్బు అవసర‌మైన‌ప్పుడు సహాయపడతాయి. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బంగారు రుణాలు అందజేస్తుంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలైన మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి కాబట్టి అవి త్వరగా రుణాన్ని పంపిణీ చేస్తుంటాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండడం సూచీలను కిందకు లాగాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోయిందన్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు తద్వారా ఆసియా మార్కెట్లు క్రితం సెషన్‌లో డీలా పడ్డాయి. దీంతో ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ సూచీలు అదే ట్రెండ్‌ను అందిపుచ్చుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.55 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ ఉదయం 51,178 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 50,636 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 434 పాయింట్ల నష్టంతో 50,889 వద్ద ముగిసింది. అదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ.. 15,074 వద్ద ప్రారంభమై.. చివరకు 137 పాయింట్లు నష్టపోయి 14,981 వద్ద స్థిరపడింది. అయితే, కొన్ని కీలక కంపెనీలు స్వల్ప వ్యవధిలో రాణించడంతో నిఫ్టీ ఉదయం స్వల్ప కాలం పాటు లాభాల్లో ట్రేడయి 15,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.

* పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్.. క‌స్ట‌మ‌ర్ ప్రెండ్లీ ఉన్న‌తి హోమ్ లోన్‌ను రూ. 35 ల‌క్ష‌ల వ‌ర‌కు అందిస్తోంది. యువ ఉద్యోగుల‌కు ఈ లోన్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. క‌నీస గృహ రుణ మొత్తం టైర్‌-1 న‌గ‌రాల‌కు రూ. 8 ల‌క్ష‌లు, టైర్‌-2 న‌గ‌రాల‌కు రూ. 6 ల‌క్ష‌లు అందిస్తోంది. ఈ ఉన్న‌తి గృహ రుణం ధ‌ర‌ఖాస్తు చేసిన వారికి ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎంఏవై) కింద సబ్సిడికి కూడా అర్హులు.