DailyDose

బొల్లారంలో భారీ పేలుడు-నేరవార్తలు

బొల్లారంలో భారీ పేలుడు-నేరవార్తలు

* సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్‌వైఎస్‌ ఎలక్ట్రానిక్‌ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాధిక అనే కార్మికురాలు మృతి చెందగా.. విజయ్‌కుమార్‌ యాదవ్‌, అన్వేశ్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. పరిశ్రమలోని కాయల్స్‌ వేడి చేసే బ్లాక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలిపారు. గాయపడినవారిని బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి తరలిచారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐడీఏ బొల్లారం సీఐ జి.ప్రశాంత్‌ తెలిపారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు బీటలు వారి, పైకప్పు లేచిపోయినట్లు కార్మికులు తెలిపారు.

* సెల్ఫీ సరదా శృతిమించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వింటూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువతి ఆ బావిలో పడిపోయింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఓ యువతి బావి వద్ద సెల్ఫీ తీసుకోవాలని భావించింది. ఇందుకోసం బావి చివరిలో నిలబడింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి ఆ బావిలో పడిపోయింది. నూతిలో పడ్డ యువతి అరుపులు విని ఆ దారిన వెళుతున్న ఓ యువకుడు అందులోకి దిగాడు. ఆమెను రక్షించిన అనంతరం పైకి ఎలా రావాలో అతడికి కూడా అర్థం కాలేదు. దీంతో ఇద్దరు కలిసి నూతిలో నుంచి కాపాడండి అంటూ అరవసాగారు. వారి అరుపులు విన్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామస్థుల సాయంతో అతి కష్టం మీద వారిరువురిని తాళ్లతో బయటకు లాగి కాపాడారు.

* పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిని రైలు కిందకు నెట్టేందుకు యత్నించిన ఘటన ముంబయిలో జరిగింది. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. వడాలా నివాసి సుమేథి జాదవ్‌, యువతి గతంలో ఒకే చోట పనిచేసినప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే, జాదవ్‌ మద్యానికి బానిసయ్యాడని తెలుసుకున్న యువతి అతడ్ని దూరం పెట్టింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని యువతిని అతడు వేధించడం మొదలుపెట్టాడు. అంథేరిలో యువతి రైలు ఎక్కగా ..జాదవ్‌ ఆమెను వెంబడించాడు. యువతి తల్లికి ఫోన్‌ చేయగా ఆమె కార్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. మరోసారి యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జాదవ్‌ లోకల్‌ రైలు వచ్చే సమయంలో ఆమెను రైలుకిందకు తోసేందుకు ప్రయత్నించాడు. యువతి, ఆమె తల్లి తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో యువతి తలకు గాయమైంది. వెంటనే జాదవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జాదవ్‌ను అరెస్టు చేశారు.

* హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యోదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న మంథని నుంచి కారులో హైదరాబాద్‌ వెళ్తున్న వామన్‌రావు, నాగమణి దంపతులను రామగిరి మండలం కల్వచర్ల వద్ద దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసులోని సాక్ష్యాలను భద్రపరచాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. హత్యకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను సైతం భద్రపరచాలని సూచించింది. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు పంచనామా చేసి వాహనాలను ఘటన స్థలం నుంచి తొలగిస్తుంటారు. కాగా న్యాయవాదుల హత్యోదంతం సున్నితమైనది కావడం, దీనికి తోడు కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టిని సారించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. హత్య జరిగిన స్థలం వద్ద సాక్ష్యాధారాలను భద్రపరిచే విషయంలో మొదట కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ, ఆ తర్వాత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతరులెవరూ ఘటన స్థలం వద్దకు రాకుండా చుట్టూ కోన్స్‌తో తాత్కాలికంగా కంచెతో పాటు సిబ్బందిని కాపలాగా ఉంచారు. అలాగే హతుల రక్త నమూనాలతో పాటు కారుపై నిందితుల వేలి ముద్రలను ఇప్పటికే సేకరించారు. ప్రత్యేక దర్యాప్తు అధికారులు మరోసారి ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు కారుపై నిందితుల వేలిముద్రలను సేకరించే అవకాశం ఉండటంతో కారును అక్కడే ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఘటనా స్థలంలో బందోబస్తును కొనసాగించనున్నట్లు సమాచారం.

* గుజరాత్‌లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం వడోదరాలోని తలావ్‌ ప్రాంతంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ర్యాలీ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుపడ్డ భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. దీంతో రంగంలోని దిగిన ఇరు పార్టీల ముఖ్య నేతలు గొడవను అదుపులోకి తెచ్చారు.

* మోసపూరిత పెట్టుబడి పథకాల పేరుతో 80 మందికి పైగా వ్యక్తుల వద్ద రూ.8 కోట్ల మేర మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. 41ఏళ్ల గోపాల్‌ దళపతి, వైర్డ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, వైర్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. తమ సంస్థ పోంజీ పథకాల్లో పెట్టుబడిపెడితే అధిక డబ్బును తిరిగి పొందవచ్చని 80 మందికి పైగా ప్రజలను నమ్మించాడు. హామీ కోసం సంస్థ డిబెంచర్ సర్టిఫికేట్లను వారికి ఇచ్చాడు.