DailyDose

మహారాష్ట్రను ముంచెత్తుతున్న కరోనా-తాజావార్తలు

Breaking News - COVID Surge In Maharashtra

* మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి.యవత్మాల్, చంద్రపూర్, నాందేడ్, జిల్లాలతో పాటు నాగ్‌పూర్, అమరావతి జిల్లాల్లో కొత్త కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి జిల్లాలో ఇప్ప‌టికే కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చారు.నాగపూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.ప‌రిస్థితులు మ‌ళ్లీ తీవ్రంగా మారుతుండ‌టంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేశారు.మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని, కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే మరోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని స్ప‌ష్టంచేశారు.వ‌చ్చే రెండు వారాలు కూడా కేసులు ఇలాగే పెరిగితే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక త‌ప్ప‌ద‌న్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుందా లేదా..? అనే విషయం త్వరలోనే స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని ఉద్ద‌వ్ థాక్రే పేర్కొన్నారు.ఇప్పటికే అమరావతి, అకోలా త‌దిత‌ర‌ ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటి పోయిందని, దాంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించామ‌ని చెప్పారు.కాగా, మ‌హారాష్ట్రలో ఆదివారం కొత్త‌గా 6,281 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,93,913కు చేరింది.

* తెలంగాణలో కొత్త పార్టీని పెట్టబోతున్న వైయస్ షర్మిల వేగం పెంచుతున్నారు. దివంగత వైయస్సార్ అభిమానులతో ఆమె సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభిమానుల సలహాలను తీసుకుంటున్నారు. ఆమెతో ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు భేటీ అయ్యారు. మరోవైపు షర్మిల తాను పెట్టబోతున్న పార్టీకి సంబంధించి అధికారికంగా తొలి నియామకం చేశారు. తన కార్యక్రమాల సమన్వయకర్తగా వాడుక రాజగోపాల్ ను నియమించారు. రాజగోపాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు. వైయస్ కుటుంబంతో ఆయనకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ దయానంద్ పార్టీకి రాజీనామా చేశారు. గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షర్మిలకు మద్దతు ప్రకటించానని చెప్పారు.

* వైసీపీ నేతలు భయపెడితే మేం ఊడిగం చేయాలా?.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని, ఎన్నికల కమిషన్‌.. అధికారాలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాల్లో వైసీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ప్రజల్ని బెదిరిస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

* పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో మైనారిటీలో పడిపోయిన సర్కార్ బలపరీక్షలో విఫలమైంది.

* అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది.ఆ దేశంలో క‌రోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వ‌చ్చింది.ఆదివారం రాత్రివ‌ర‌కు అక్క‌డ మొత్తం 4.98 లక్షల కొవిడ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ నివేదికలు ఈ వివ‌రాల‌ను వెల్లడించాయి.

* అసోం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేమోజీ జిల్లాలోని శిలపతార్​లో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను ప్రారంభించి… జాతికి అంకితమిచ్చారు.

* భారత్​కు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీలో శతాబ్దాల అనుభవం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

* మహారాష్ట్ర మరో మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు సోమవారం కరోనా సోకింది.‘‘నేను సోమవారం చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది.గత రెండు మూడు రోజులుగా నాతో కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి.నా ఆరోగ్యం బాగానే ఉంది, ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, పౌరులందరూ జాగ్రత్తలు తీసుకోండి’’ అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.

* భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్లాను జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డు వరించింది.

* హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవి గారికి టీఆర్ఎస్ పార్టీ బి-ఫామ్ అందజేసిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్

* హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం కిషన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర భాజపా నేతల బృందం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని బృందం గడ్కరీని కోరింది.

* బోధన్‌ పాస్‌పోర్టు కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. ఈ మేరకు సీపీ మీడియాతో మాట్లాడారు. అరెస్టైన వారిలో నలుగురు బంగ్లాదేశీయులు, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి, ఓ ఏజెంట్‌, ఇద్దరు స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఉన్నారన్నారు. ఒకే అడ్రస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అయ్యాయని చెప్పారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గద్వాల‌ విజయలక్ష్మి ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్‌ ఎన్నికలో తెరాస పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికైన విషయం తెలిసిందే.