Sports

కమల తీర్థం పుచ్చుకున్న పీటీ ఉష

కమల తీర్థం పుచ్చుకున్న పీటీ ఉష

దేవభూమి కేరళలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దక్షిణాది రాష్ట్రంపై భాజపా గురిపెట్టినట్లు కన్పిస్తోంది. ఇందుకోసం పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను ఎన్నికల బరిలోకి దించాలని యోచన చేస్తోంది. ఇప్పటికే మెట్రోమ్యాన్‌ ఇ. శ్రీధరన్‌ భాజపాలో చేరుతుండగా.. తాజాగా పరుగుల రాణి పీటీ ఉష కూడా కాషాయ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.మాజీ అథ్లెట్‌ అయిన పీటీ ఉష.. గత కొంతకాలంగా సాగు చట్టాలపై కేంద్రం, భాజపాకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై సానుకూలంగా ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె భాజపాలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలపై స్పందించేందుకు ఉష సన్నిహిత వర్గాలు నిరాకరించాయి.వామపక్షం అధికారంలో ఉన్న కేరళలో పట్టు సాధించేందుకు భాజపా గత కొంతకాలంగా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే శబరిమలలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా ఉన్న కాషాయ పార్టీ.. ఇప్పుడు ప్రముఖుల ద్వారా పట్టణ ఓటర్లను ఆకర్షించాలని చూస్తోంది. శ్రీధరన్‌, పీటీ ఉషతో పాటు కొందరు సినీ ప్రముఖులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.మరోవైపు అటు కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడైన రాహుల్‌ గాంధీ ఈ రాష్ట్రం నుంచే ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో అధికారం సాధించాలని పట్టుదలగా ఉంది.