Movies

ఇండియా మొత్తం మారుమ్రోగాలి

ఇండియా మొత్తం మారుమ్రోగాలి

కన్నడ సోయగం రష్మిక మందన్న చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరిగా తిరుగులేని స్టార్‌డమ్‌తో చలామణీ అవుతున్న ఈ అమ్మడు ‘మిషన్‌ మజ్ను’ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్‌లను కైవసం చేసుకుంటున్న ఈ భామ పారితోషికాన్ని కూడా అదే స్థాయిలో పెంచిందని వార్తలొస్తున్నాయి. ఒక్క సినిమాకు ఆమె రెండుకోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటోందని కథనాలు వచ్చాయి. వీటిపై ఈ సొగసరి స్పందిస్తూ ‘అందరు అనుకుంటున్నట్లుగా అంతమొత్తం పారితోషికం తీసుకోవాలన్నది నా కల. అది నిజమైతే బాగుండేది. సాధారణంగా నేను సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎక్కువగా మాట్లాడను. పారితోషికం గురించి ప్రస్తావిస్తే ఇతర నాయికలతో పోల్చి చూస్తారు. అది నాకు నచ్చదు’ అని చెప్పింది. భాషాపరంగా తాను ఎలాంటి పరిమితులు విధించుకోలేదని..నటిగా పాన్‌ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోవాలన్నదే లక్ష్యమని పేర్కొంది. ‘కన్నడ సినిమాను సొంత ఇల్లుగా భావిస్తా. ఇక తెలుగు పరిశ్రమ నాకు ఓ పాఠశాలలాంటిది. ఇక్కడే నటనకు సంబంధించి ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా’ అని చెప్పుకొచ్చింది ఈ కూర్గ్‌ బ్యూటీ. ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప’ ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.