NRI-NRT

హేమా కానూరు నామినేషన్ తిరస్కరణపై పొట్లూరి రవి వివరణ

The reason why hema kanuru nomination was denied by TANA Election committee

తానా 2021 ఎన్నికల్లో అంతర్జాతీయ సమన్వయకర్త పదవికి కొడాలి నరేన్ ప్యానెల్ నుండి కానూరు హేమా (చికాగో), శృంగవరపు నిరంజన్ ప్యానెల్ నుండి వడ్లమూడి హితేష్(అట్లాంటా)లు పోటీపడ్డారు. నేడు ఎన్నికలకు నామినేషన్లు సమర్పించిన తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తానా 2021 ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఐనంపూడి కనకంబాబు వడ్లమూడి హితేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నామినేషన్ల దరఖాస్తులో తానా సభ్యుల సంతకం కూడా ఉండాలనే నిబంధన ఉంది. కాగా తన నామినేషన్లో సంతకం చేయవల్సిన వ్యక్తి వివరాలను హేమా తానా కార్యదర్శి రవి పొట్లూరితో చర్చించి వారి సభ్యత్వాన్ని ధృవీకరించుకున్నారు. వారి వివరాలు సరైనవేనని రవి ఖరారు చేయడంతో ఆయా సభ్యుల చేత సంతకం చేయించి హేమా తన దరఖాస్తును ఎన్నికల కమిటీకి సమర్పించారు.

ఇక్కడే కథ మలుపు తిరిగింది. తానా అధ్యక్షుడిగా జంపాల చౌదరి ఉన్న హయాంలో వివిధ కారణాల వలన ధృవీకరణ పత్రాలు అందజేయని లేదా ఒక ప్రాంతంలో నివసిస్తూ మరో ప్రాంతపు చిరునామా కలిగిన ధృవీకరణ పత్రాలు సమర్పించిన 1100 మంది వివరాలను తానా డేటాబేస్‌లో నుండి తొలగించాలని బోర్డు నిర్ణయించింది. కానీ వీటిని తొలగించకుండా అప్పటి డేటాబేస్ నిర్వాహకుడు ఈ 1100మందికి డేటాబేస్‌లో ఒక “ఫ్లాగ్”(సూచిక)ను సృష్టించి చేతులు దులుపుకున్నారు. తాళ్లూరి జయశేఖర్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన అనంతరం తానా డేటాబేస్‌ను సరికొత్త వ్యవస్థలోకి మార్చే సందర్భంలో డేటాబేస్‌లో గత నిర్వాహకులు అమలు చేసిన “ఫ్లాగ్”(సూచికలు) నూతన వ్యవస్థలోకి అనుసంధానం కాలేదు. హేమా రవితో సభ్యుల వివరాలు ధృవీకరించుకున్న సమయంలో సదరు సూచికలు లేకపోవడంతో రవి ఆయా సభ్యులు తానాలో నిజమైన సభ్యులను ధృవీకరించగా హేమా వారి సంతకాలతో దరఖాస్తును పంపించారు.

కథలో రెండో మలుపు. తానా 2021 ఎన్నికల కమిటీకి అందించిన జీవిత కాల సభ్యుల పట్టికలో ఈ 1100మంది అక్రమ సభ్యుల వివరాలు మొత్తంగా తొలగించి అందజేశారు. కనకంబాబు బృందం హేమా దరఖాస్తు పరిశీలించినప్పుడు ఆయన నామినేషన్‌పై సంతకం చేసిన వ్యక్తులు తానాలో జీవితకాల సభ్యులు కాదని తేలడంతో ఆయన దరఖాస్తును తిరస్కరించారు. హేమా పదవికే ఎసరు పడింది. వడ్లమూడి హితేష్ పంట పండింది.

ఈ విషయంపై రవి TNIతో ప్రత్యేకంగా స్పందిస్తూ….ఇది కేవలం ఒక వ్యక్తి వలనో ఒక కాగితం వలనో కలిగిన నష్టం కాదని, సంస్థాగతమైన ఎన్నో లోపాలను ఈ ఒక్క నామినేషన్ ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు. హేమా తనను సంప్రదించే సభ్యుల వివరాలను ధృవీకరించుకున్నారని, కానీ ఎన్నికల కమిటీ వద్ద వేరొక పట్టిక ఉండటంతో హేమా కానూరుకు అన్యాయం జరిగిందని అన్నారు.
TANA Elections 2021 - Niranjan Sringavarapu Panel