Business

లగేజీ లేకపోతే తక్కువ ధరకు విమాన టికెట్-వాణిజ్యం

Business News - Flight Tickets Will Be Cheaper For No Luggage Passengers

* శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు మరో బ్లాక్‌‌ ఫ్రైడేని చవిచూశాయి. సూచీలు ఒకేరోజు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,256 వద్ద, నిఫ్టీ 14,888 వద్ద ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. ఇంట్రాడే ఏ దశలోనూ సూచీలకు మద్దతు లభించకపోవడంతో అంతకంతకూ దిగజారుతూపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,510 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల తేడాను నమోదు చేశాయి. 50,400 వద్ద గరిష్ఠాన్ని తాకిన బీఎస్‌ఈ ఇండెక్స్‌.. 48,890 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ సూచీ 14,919 వద్ద గరిష్ఠాన్ని.. 14,467 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్‌ 1939 పాయింట్ల నష్టంతో 49,099 వద్ద ముగియగా.. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.14 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లో టాప్‌ 30 కంపెనీల్లో ఏ ఒక్కటీ లాభాలను రాబట్టలేకపోయాయి. నిఫ్టీ టాప్‌ 50లోనూ అదే పరిస్థితి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

* లగేజ్‌ లేకుండా భారత్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే త్వరలో మీ ప్రయాణం కాస్త చౌక కానుంది. ఇకపై చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇచ్చేలా దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 1700 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 500 పైగా నష్టపోయింది. మార్కెట్ల ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్‌(వీఐఎక్స్‌) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది. సాధారణంగా వీఐఎక్స్‌ పెరుగుదల మదుపర్ల అనిశ్చితి, భవిష్యత్తు భయాల్ని సూచిస్తుంటుంది. తర్వాతి రాబోయే 30 రోజుల్లో మార్కెట్‌ కదలికల్ని ఇది తెలియజేస్తుంటుంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీల్ని భారీగా దిగజార్చుతున్నాయి. ప్రారంభం నుంచే ప్రతికూలంగా ఉన్న మార్కెట్లకు ఏ దశలోనూ అండ దొరకలేదు. సెన్సెక్స్‌ టాప్‌ 30 కంపెనీల్లో కేవలం ఒకే ఒక్క కంపెనీ లాభాల్లో పయనిస్తుండడం సూచీలపై బేర్‌ బిగించిన పట్టుకు అద్దం పడుతోంది.

* దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న సంగతి మనకు తెలిసిందే‌. కొన్ని రాష్ట్రాల్లో అయితే చమురు ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజానీకం బయటకి వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరల తగ్గింపు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రజలు ఏదైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.