Business

ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా-వాణిజ్యం

ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా-వాణిజ్యం

* ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ అందించే ఉజ్వల పథకం కింద మరో కోటి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రెండేళ్లలో వీటిని అందించనున్నారు. ఇది పూర్తయితే నూరు శాతం కుటుంబాలు ఎల్పీజీని వినియోగించినట్లు అవుతుందని ఇంధన శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్‌ కనెక్షన్లకు సంబంధించిన ప్రణాళికలు రూపు దిద్దుకుంటున్నాయని చెప్పారు. ఎల్పీజీ కనెక్షన్‌కు నామమాత్రపు ధ్రువీకరణ పత్రాలు సరిపోతాయని కపూర్‌ చెప్పారు. నివాస ధ్రువపత్రం కోసం ఒత్తిడి తేబోమని వెల్లడించారు.

* ఫేస్‌బుక్‌ కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. ఫేసుబుక్ వినియోగదారుల అనుమతి లేకుండా ఫోటో ఫేస్-ట్యాగింగ్, ఇతర బయోమెట్రిక్ డేటాను ఉపయోగించడంపై 650 మిలియన్ డాలర్లు(సుమారు రూ.4,780 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగిందంటూ అమెరికాలోని ఇల్లినాయిస్లో 2015లో దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ పిటిషన్‌పై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో విచారణ చేపట్టారు. ఇల్లినాయిస్లో దాదాపు 1.6 మిలియన్ల మంది ఫేసుబుక్ వినియోగదారులు వాదనలు సమర్పించారు.

* ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని ‘జైష్‌ ఉల్‌ హింద్‌’ సంస్థ ప్రకటించింది. టెలిగ్రామ్‌ యాప్‌లో మెసేజ్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాకుండా తమ సంస్థకు డబ్బులు పంపించాలని ముఖేష్‌ను డిమాండ్‌ చేసింది. బిట్‌కాయిన్‌ ద్వారా అడిగినంత ధనాన్ని పంపాలని కోరింది. గురువారం పేలుడు పదార్థాలతో ఆ వాహనాన్ని అంబానీ ఇంటి సమీపంలో పార్క్‌ చేసిన తమ సోదరుడు సేఫ్‌గా ఇంటికి చేరుకున్నాడు అని పేర్కొంది.

* బంగారం ధరలు వరుసగా ఐదో రోజు కూడా తగ్గుతూ వచ్చింది. హైదరాబాద్ లో గత ఐదు రోజులుగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయలకు పైగా పడిపోయింది. నిన్న ఒక్కరోజే ఎంసీఎస్స్ లో పది గ్రాములు 22క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గితే నేడు రూ.10 తగ్గింది. దీంతో ధర రూ.42,690కి చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,570కు చేరుకుంది. నేడు వెండి ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నిన్న రూ.800 తగ్గి రూ.72,500కు చేరుకుంది. దేశీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి.

* కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి.