Fashion

మంచం మీద మేకప్ వద్దు

మేకప్‌తో పొడుకోవద్దు

మేకప్‌ ఇప్పుడు అందరికీ సర్వసాధారణమైంది. అలంకరణపై ఉన్న ఆసక్తి దాన్ని తొలగించుకోవడంలో ఉండదు కొందరికి. చర్మం పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలోనూ శ్రద్ధ చూపించరు. కానీ సరైన మెలకువలను పాటించకపోతే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకోసమే మీకు ఈ చిట్కాలు…
* ఐషాడో కళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే రోజంతా దాన్ని అలానే ఉంచుకోవడం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంటికి రాగానే పాలల్లో ముంచిన దూదితోనో లేదా రసాయనాలు లేని రిమూవర్‌తోనో తొలగించండి. అప్పుడే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
* మేకప్‌ని తొలగించకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ముడతలు వచ్చి వయసు కంటే ఎక్కువగా కనిపించే అవకాశమూ లేకపోలేదు. వైట్‌హెడ్స్‌, బ్లాక్‌హెడ్స్‌, మొటిమల వంటివీ ఇబ్బందిపెట్టొచ్చు. లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు అలానే ఉంచితే అది మీ పెదాలపై ఉండే తేమను పీల్చుకుంటుంది. దాంతో అధరాలు పొడిబారి పగులుతాయి. కాబట్టి లిప్‌స్టిక్‌ని తుడిచేశాక కొద్దిగా తేనె రాసుకోండి.
* మేకప్‌ పూర్తిగా తొలగించాక ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఆపై నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని రాయాలి. మార్కెట్లో సహజ పదార్థాలతో చేసిన సీరమ్‌లూ దొరుకుతున్నాయి. వాటిని రాత్రిపూట నిద్రపోయే ముందు రాసుకుంటే చర్మ గ్రంథులు ఉత్తేజితమై నిగారింపుతో కనిపిస్తుంది. రసాయనాల ప్రభావం పడకుండా ఉంటుంది.