దంపతుల్లో ఎవరికైనా ప్రతిరోజూ తీయని పానీయాలు (సుగర్-స్వీటెన్డ్ డ్రింక్స్) తాగే అలవాటుంటే గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. ఇలాంటి పానీయాలను సేవించడానికి.. సంతానసాఫల్య అవకాశాలు తగ్గడానికి మధ్య సంబంధం ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈమేరకు బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఉత్తర అమెరికా జంటలపై 12 నెలలపాటు అధ్యయనం జరిపారు. 3,828 మంది మహిళలు, వారిలో కొందరి భాగస్వాములపై సర్వే నిర్వహించారు. గర్భం దాల్చాలని కోరుకుంటే తీయని పానీయాల వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రధాన అధ్యయన రచయిత, విశ్వవిద్యాలయానికి చెందిన ఎలిజబెత్ హేచ్ సూచించారు. అలాగే కెఫిన్ తీసుకోవడం, ఆల్కాహాల్ సేవించడం, ధూమపానం, ఆహార నియమాలు, స్థూలకాయం వంటివి కూడా గర్భధారణపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడించారు. పురుషులు, మహిళల్లో తీయని పానీయాలు సేవించే అలవాటుంటే సగటున 20శాతం గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోయినట్లు గుర్తించారు. మహిళలు రోజుకు కనీసం ఒక సోడా తీసుకుంటే 25 శాతం.. అదే పురుషులు తీసుకుంటే వారి భాగస్వాములకు 33 శాతం గర్భధారణ అవకాశాలు తగ్గిపోయినట్లు అధ్యయనంలో తేలింది. శక్తి పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్) తీసుకుంటే ముప్పు మరింతగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంతానసాఫల్య అవకాశాలు మెరుగుపడాలంటే దంపతులు మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించారు.
మీ భాగస్వామి తాగుతారా?
Related tags :