Business

తగ్గుతున్న పసిడి ధరలు-వాణిజ్యం

తగ్గుతున్న పసిడి ధరలు-వాణిజ్యం

* దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.గడచిన 7 నెలల్లో బంగారం ధర సుమారు రూ. 11,500 వరకూ తగ్గింది.ఆగస్టు 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ. 50,200 ఉండగా, అది 2021 మార్చి 2 నాటికి 44,760కు చేరింది.2021 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకూ 5,540 మేరకు బంగారం ధర తగ్గింది.2021 జనవరి 1న బంగారం ధర 50,300గా ఉండగా, ప్రస్తుత ధర రూ.44,760గా ఉంది.అంటే కేవలం రెండు నెలల్లో బంగారం ధర 11 శాతానికి తగ్గింది.అయితే వెండి ధరల విషయానికొస్తే సుమారు 11 వేల రూపాయల మేరకు పెరిగింది.2021 జనవరి 1న వెండి ధర రూ.66,950గా ఉండగా, ఇప్పుడు రూ 67,073గా ఉంది.

* హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎమ్‌టార్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తొలిరోజే దుమ్ము రేపింది. ఐపీవో ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ కంపెనీ షేర్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. ఈ ఆఫర్‌లో 72.60 లక్షల షేర్లు ఇష్యూలో ఉండగా.. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికే 91 లక్షల షేర్లకు బిడ్లు అందాయి. రిటైల్‌ విభాగంలో ఈ కంపెనీ షేర్లు ఇప్పటికే 1.75 శాతం ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌లో మంచి అనుభవం ఉన్న ఈ సంస్థ షేర్లకు భారీ డిమాండ్‌ లభిస్తోంది. అణు రియాక్టర్లు‌, ఏరోస్పేస్‌ ఇంజిన్లు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధ విమానాల్లో వినియోగించే కీలక విడిభాగాలను తయారు చేయడంలో ఈ కంపెనీ పేరుగాంచింది. నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన ఈ కంపెనీ క్రమంగా తమ ఉత్పత్తులను వివిధ రంగాలకు విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కంపెనీ నేపథ్యం, ఐపీవోకు సంబంధించిన కీలక వివరాలను పరిశీలిద్దాం..! ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన 1,22,24,270 షేర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 40 లక్షల షేర్లు తాజావి కాగా.. మిగిలినవి ప్రమోటర్ల వాటాలు. వీటిని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. ఈ ఐపీవో ద్వారా దాదాపు రూ.600-650 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 15 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.178.92 కోట్లు సమీకరించింది. దీంతో ఈ నెల 2న రూ.575 ధర వద్ద 31,11,725 షేర్లను ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో నొమురా ఫండ్స్‌ ఐర్లాండ్‌, జూపిటర్‌ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్‌, వైట్‌ ఓక్‌ కేపిటల్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ ఇండియా తదితర విదేశీ ఫండ్లు ఉన్నాయి. దేశీయ సంస్థలైన ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.70 కోట్లు, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

* డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్ నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ (ఎన్‌పీసీఐ)కి ప్ర‌త్యామ్నాయంగా న్యూ అంబ్రెల్లా ఎంటిటీ (ఎన్‌యూఈ) ఏర్పాటు చేయడానికి అవ‌స‌ర‌మైన‌ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అగ్ర బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. నివేదికల ప్రకారం, లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఫేస్‌బుక్‌, గూగుల్, ఇన్ఫీబీమ్‌ల‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. మరిన్ని సంస్థ‌లు ఈ లైసెన్స్‌పై దృష్టి సారించాయి. పేటీఎం, ఓలా ఇండ‌స్‌ఇండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టాటా సన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లతో చేతులు కలిపింది. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో దరఖాస్తు చేసుకోవాలని అమెజాన్ యోచిస్తోంది.

* నాణ్య‌మైన‌, ఉన్న‌త విద్య విద్యార్ధికి విజ‌య‌మంత‌మైన జీవితాన్ని ఇవ్వడంలో తోడ్ప‌డుతుంది అన‌డంలో సందేహం లేదు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఉన్న‌త విద్య‌వైపు అడుగులు వేస్తున్నారు. ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల‌లో చ‌ద‌వాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. దీంతో ఉన్న‌త చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చు పెరిగింది. ప్ర‌తిభావంతులైన విద్యార్ధులు ఆర్థిక స‌హాయం లేని కార‌ణంగా ఉన్న‌త విద్య‌కు దూరంగా ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విద్యా రుణాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వ బ్యాంకుల‌తో పాటు బ్యాంకింగేత‌ర సంస్థ‌లు కూడా విద్యా రుణాల‌ను అందిస్తున్నాయి.

* అతిపెద్ద దేశీయ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ).. భారత్‌లోని చెల్లింపు గేట్‌వే ఆపరేటర్లకు సువర్ణావకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థతో అనుబంధం ఉన్న 250 మిలియన్ల మంది పాలసీదారుల నుంచి ప్రీమియం సహా ఇతరత్రా చెల్లింపులను డిజిటల్‌గా స్వీకరించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దేశంలోని పేమెంట్‌ అగ్రిగేటర్ల నుంచి బిడ్లకు ప్రతిపాదనలు పంపినట్లు ‘బిజినెస్ ఇన్‌సైడర్‌’ పేర్కొంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆయా కంపెనీలకు ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ పంపినట్లు సమాచారం. దేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న డిజిటల్‌ పేమెంట్స్‌తో లబ్ధిపొందుతున్న ఆయా సంస్థలకు ఇది ఓ సువర్ణావకామనే చెప్పాలి. రాత్రికి రాత్రే లక్షల మంది వినియోగదారులను సంపాదించుకునేందుకు రేజర్‌పే, పేటీఎం, పేయూ వంటి పేమెంట్‌ గేట్‌వేలకు ఇది ఓ చక్కని అవకాశం.