Business

ఈపీఎఫ్ వడ్డీరేట్లపై గుడ్ న్యూస్-వాణిజ్యం

Business News - EPF Interest Rate Hiked

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీరేటును 8.50 శాతంగా నిర్ణయించారు. కేంద్ర ధర్మకర్తల బోర్డు సమావేశం గురువారం శ్రీనగర్‌లో జరిగింది. ఈ సమావేశంలో వడ్డీరేటును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం తొలుత జరిగినా.. గతేడాది ఉన్న రేటునే యథాతథంగా ఉంచారు.

* దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరో కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన విజయవంతమైన మోడల్‌ ప్లాటినాకు కొత్త హంగులు జోడించి ప్లాటినా-110 పేరుతో దీన్ని విడుదల చేసింది. 115 సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్‌లో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) అందిస్తుండడం ప్రత్యేకత. ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తున్న ఈ బైక్‌ ధరను రూ.65,920 (ఎక్స్‌ షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది.

* తాకట్టులో ఉన్న పలు ఆస్తులను ఎస్‌బీఐ మార్చి 5న ఈ-వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్‌ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ వేలంలో అన్నిరకాల ప్రాపర్టీలను వీటిల్లో విక్రయించనున్నట్లు తెలిపింది. నివాస ప్రాంగణాలు, గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి వీటిల్లో ఉన్నట్లు ఎస్‌బీఐ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

* చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొస్తే దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75కు దిగొస్తుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. కానీ ఇందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా లేరని, అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

* కరోనా మహమ్మారి వల్ల ఏర్పడి సంక్షోభ సమయంలోనూ భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో ఎఫ్‌డీఐలు 40శాతం పెరిగి దేశంలో 51.47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.

* చాలా మంది ప్రజలు తమ ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి కోసం వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్ (వీపిఎఫ్) లో పెట్టుబడి పెడతారు, ఎందుకంటే ఇది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) మాదిరిగా అదే ప్రయోజనాలను పొందుతుంది. ఏదేమైనా, బడ్జెట్ 2021 లో ప్రభుత్వం ఈపీఎఫ్‌పై పన్నుల మార్పులను ప్రతిపాదించింది, ఇది వీపీఎఫ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉద్యోగి ఈపీఎఫ్ కేటాయింపులు రూ. 2.5 లక్షలకు మించి ఉంటే దానిపై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను వ‌ర్తిస్తుంది. మ‌రి ఈ ప్ర‌తిపాద‌న తర్వాత‌ ముఖ్యంగా అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి వీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? వీపీఎఫ్‌లో ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌ కింద వారి జీతం నుంచి 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అందించవచ్చు. వీపీఎఫ్‌పై వడ్డీ రేటు ఈపీఎఫ్‌‌తో సమానం, ఇది సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపులో ప్రభుత్వం ప్రకటిస్తుంది. వీపీఎఫ్‌ కూడా అదే పన్ను ప్రయోజనాలను ఇస్తుంది. మూడుద‌శ‌ల్లో ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఉద్యోగం మారిన‌ప్పుడు ఈపీఎఫ్‌ను బ‌దిలీ చేసుకున్న‌ట్లే వీపీఎప్ నిధిని కూడా చేయ‌వ‌చ్చు. ఈ రెండూ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) తో అనుసంధానమై ఉంటాయి. ఉపసంహరణ నియమాలు కూడా ఒకటే.