Devotional

తిరుమల చేరుకున్న వెంకయ్యనాయుడు-TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి

M Venkaiah Naidu Reaches Tirumala - Spiritual News

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రీశుడి ఆలయం పనులను సీఎం పరిశీలించారు. గత పర్యటన సందర్భంగా చేసిన సూచనల మేరకు పనులు జరిగాయా.. ఇంకా పూర్తి కావాల్సి ఉన్న పనుల గురించి తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానాలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ స్థపతి ఆనందాచారి వేలు, ఆనంద్‌సాయిని నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాడ వీధులు, ప్రాకార మండపాలు, విద్యుద్దీపాలు, దర్శన సముదాయాలను, తూర్పు రాజగోపురం, బ్రహ్మోత్సవం మండపాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరు 11న ప్రారంభించగా…ఇప్పటి వరకు సుమారు రూ. 850 కోట్ల వరకు ఖర్చయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

* భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 5.15 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్జెట్టి స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆర్డివో కనక నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి శ్రీనివాసుడు కాళీయమర్దనుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై కటాక్షించారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు సర్వభూపాల వాహనసేవలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనంజయులు తదితరులు పాల్గొన్నారు.

* ఓం నమో వేంకటేశాయతిరుమల సమాచారం(04-03-2021)🕉 నిన్న మార్చి 3 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 51,725 మంది…‌ ‌🕉 నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.69 కోట్లు.🕉 నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26,104 మంది…🕉 తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేస్తున్న టిటిడి…🕉‌ అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో మరుసటి రోజులకు పరిమిత సంఖ్యలో టోకన్లు ఇస్తున్న టిటిడి…..

* ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి ఉన్న మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం.భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 9.45 గంటలకు స్వామివారి అర్చకులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు.మరోవైపు ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది.శివనామస్మరణతో భక్తులు శ్రీగిరుల వెంట పాదయాత్రగా తరలి వస్తున్నారు. 14న మహాశివరాత్రి పర్వదినం రోజున తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలి వస్తారని, ఈ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు.