DailyDose

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం-నేరవార్తలు

Crime News - Huge Fire Accident In Vijayanagaram District

* బిహార్‌లోని ప్రత్యేక ఎక్సైజ్‌ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో కల్తీ సారా తాగి 21మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు సంబంధించిన కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. ఇదే వ్యవహారంలో దోషులుగా తేలిన నలుగురు మహిళలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

* విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెం గిరిజన గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 పూరిళ్లు దగ్ధమవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తహశీల్దారు సీతారామరాజు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

* నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి గ్రామంలో ముగ్గురు గిరిజన బాలికలు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పోట్లపూడి గిరిజన కాలనీకి చెందిన ఉప్పల చెంచురామమ్మ(15), ఉప్పల సేనమ్మ(8), కవరగిరి తులసి(12) గురువారం నుంచి కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో రాత్రి చుట్టుపక్కల గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

* నేటి యువతకు సెల్ఫీలపై ఉన్న మోజు ఏపాటిదో చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫీల కోసం వింతవింత ప్రయోగాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిని సైతం మనం చూస్తున్నాం. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేయడం నేటి యువతరం లక్షణాల్లో ఒకటి. అందులో తప్పేం లేదు. కానీ, వెళ్లిన చోటు ఎలాంటిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. ఒక్క ఫొటోతో ఎన్నో విషయాలు బయటపడతాయని సైబర్‌ నిపుణులు చెబుతుంటారు. అలాంటి సంఘటనే జర్మనీలో జరిగింది. ఓ యువకుడు జైలులో ఒక్క సెల్ఫీ తీసుకోవడం వల్ల ఏకంగా జైలులో ఉన్న వందలాది గదులకు తాళాలు మార్చాల్సి వచ్చింది.