DailyDose

కేటీఆర్ నకిలీ కార్యదర్శి అరెస్ట్-నేరవార్తలు

Crime News - KTR Fake Personal Secretary Arrested

* తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నానంటూ వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు నిందితుడు ఫోన్‌ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేటకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజుగా గుర్తించారు. దాదాపు 9 కంపెనీల నుంచి రూ.39.22 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్ల ద్వారా కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్‌ నెంబర్లను సేకరించేవాడు. కేటీఆర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడు. గతంలోనూ నాగరాజు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

* గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇండస్‌ వివా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. గొలుసుకట్టు మోసం, అరెస్టు వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. బెంగళూరుకు చెందిన అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌ సహా మరికొంత మంది ముఠాగా ఏర్పడి బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఇండస్‌ వివా హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో గొలుసుకట్టు వ్యాపారాన్ని ప్రారంభించారు.

* బిల్లు చెల్లించలేదని, పూర్తిగా చికిత్స అందించకుండా ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం మూడేళ్ల బాలిక నిండు ప్రాణాన్ని తీసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. శస్త్రచికిత్స తరవాత వైద్యులు సరిగా కుట్లు కూడా వేయలేదనే ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. ఆ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబం కౌశాంబి జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది.

* అత్యాచారానికి గురైన మహిళ.. ఆ ఘటన వల్ల తనకు జన్మించిన సంతానానికి తండ్రి పేరేం చెప్పాలని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అది కూడా లైంగిక దాడి జరిగిన 27 సంవత్సరాల తరువాత. కోర్టు ఆదేశాల మేరకు ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం…..27 సంవత్సరాల క్రితం బాధితురాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహనాజ్‌పూర్‌లో తన అక్క, బావలతో కలిసి ఉండేది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు. ఒకసారి ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టి, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత నిందితుడు సోదరుడు కూడా జత కలిశాడు. వారిద్దరూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు నగర ఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమె 1994లో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అనంతరం తన సొంత గ్రామమైన ఉదంపూర్‌కి చెందిన వ్యక్తికి ఆ బాలుడిని ఇచ్చేసింది. తర్వాత తన అక్క కుటుంబం బదిలీపై రాంపూర్‌కు వెళ్లడంతో బాధితురాలు కూడా వారి వెంటే వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆమెకు వివాహం జరిగినప్పటికీ..లైంగిక దాడి గురించి తెలిసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దాంతో ఆమె ఉదంపూర్‌కు వచ్చి అక్కడే ఉండిపోయింది.

* బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాంబు దాడి కలకలం సృష్టించింది. గోసబా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బృందంపై నాటు బాంబు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అయితే దాడిలో గాయపడిన వారంతా భాజపా కార్యకర్తలుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన కార్యకర్తలు కొందరు శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిపై నాటు బాంబు విసిరారు. పేలుడు ధాటికి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారే చేశారని క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బెంగాల్‌లో కార్మిక మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పైనా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.