Politics

షర్మిల ఆవిష్కరించిన వైఎస్ విగ్రహం ధ్వంసం-నేరవార్తలు

Crime News - YSR Statue Destroyed In Khammam District

* దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ అభిమానులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెఎస్ షర్మిల త్వరలో పార్టీ ఏర్పాటు చేయబోతున్న క్రమంలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఆమెకు లభిస్తున్న ప్రజాధారణను తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని.. షర్మిల ఫాలోవర్స్ చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో షర్మిల బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ధ్వంసమైన విగ్రహాం 2013లో షర్మిల ఆవిష్కరించిందే అవ్వడం గమనార్హం.

* రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సౌదీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పట్టపగలే రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారులోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ షఫీ(30) ఉస్మాన్ సాగర్‌లో నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితమే సౌదీ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ.. ఇవాళ రాఘవేంద్ర కాలనీలో రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్జీవంగా చెట్టుకు వేలాడుతున్న సయ్యద్‌ను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. నిత్యం ప్రజలు తిరిగే ఈ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వంద రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యమం వంద రోజులు దాటినా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న నిరాశతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైతు లేఖలో రాశాడు. ఆదివారం ఉదయం ఆందోళన చేస్తున్న టిక్రీ బోర్డర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హర్యానాలోని హిస్సార్‌ జిల్లాకు చెందిన రాజ్‌బీర్‌ (49) గా గుర్తించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బహదూర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలంలో ఓ లేఖ కూడా లభ్యమైనట్లు వెల్లడించారు.

* ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఒక్కసారిగా వేయి కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో అధికారులే ఆశ్యర్యం వ్యక్తంచేశారు. ఈ దాడులు త‌మిళ‌నాడులో గురువారం జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఐటీ అధికారులు తెలిపారు. బులియ‌న్ ట్రేడ‌ర్‌, ద‌క్షిణ భార‌త‌దేశంలో అతిపెద్ద జువెల‌రీ రిటెయిల‌ర్‌పై జ‌రిగిన ఈ దాడుల్లో ఏకంగా రూ.1000 కోట్లకు పైగా అక్రమాస్తులు లభించినట్లు సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది. త‌మిళ‌నాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు బ‌య‌ట‌ప‌డ‌టం ఇప్పుడు పలు ఊహాగానాలకు తావిస్తున్నాయి.

* తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ‌ మనవడిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మహమూద్‌ అలీ మనవడు ర్యాగింగ్ చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. హోంమంత్రి అలీ మనవడు ఫర్హాన్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3 లోని ముఫకంజా ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఫరాన్‌ తమను ర్యాగింగ్‌ చేస్తున్నాడంటూ అదే కళాశాలకు చెందిన బీటెక్‌ విద్యార్థి రియాన్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సాయంత్రం తనపై దాడి చేశాడని.. అతనిపై చర్యలు తీసుకఉని తనను కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా తన చేతికి అయిన ‌గాయాల‌ను రియాన్ మీడియాకు చూపించాడు.