Politics

స్టే ఇచ్చిన హైకోర్టు-తాజావార్తలు

High Court Stays CID Notices On Chandrababu And Narayana

* రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

* తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయంలో అతి విశ్వాసం పనికిరాదని.. అందరూ సమన్వయం చేసుకుంటూ ఎంపీ అభ్యర్థి డా. గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా నేతలు కష్టపడి పనిచేయాలని సూచించారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఒక మంత్రి, అదనంగా ఒక ఎమ్మెల్యే ఉంటారని వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్‌ సమీక్షించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి డా. గురుమూర్తిని నేతలకు సీఎం పరిచయం చేయించారు.

* కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడి ఏడాది పూర్తయినా ఇప్పటికీ వాటి మూలాలపై స్పష్టత రాలేదు. వీటిపై దర్యాప్తు చేపట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ప్రత్యేక బృందం.. వుహాన్‌ ల్యాబ్‌నుంచి వైరస్‌ లీక్‌ అయ్యే అవకాశాలను కొట్టిపారేసింది. ఇలా కొవిడ్‌ మూలాలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. కరోనా వైరస్ మూలాలకు చైనాలోని వన్యప్రాణుల పెంపకం కేంద్రాలే కారణమై ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు భావిస్తున్నారు.

* కరోనా టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

* ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఈమేరకు శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. సభా హక్కులకు భంగం కలిగించారంటూ చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నానని ఎస్ఈసీ పేర్కొన్నారు. శాసనసభ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. సభా హక్కులు ఉల్లంఘించారంటూ తనకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత ముందుకు వెళ్లాలని భావిస్తే తగినన్ని ఆధారాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తగినంత సమయం ఇవ్వాలని ఎస్ఈసీ కోరారు. ఇటీవలే కొవిడ్ టీకా తీసుకున్నందున ప్రస్తుతం ప్రయాణాలు చేయలేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖలో వివరించారు.

* తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ శుక్రవారం విడుదల చేశారు. గృహిణులకు ఆదాయం అందించే హామీని ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. వారి నైపుణ్యాలకు తగిన ఆదాయం లభించేలా చేస్తామని, అంతే తప్ప ఉచితంగా పంపిణీ చేయడం కాదని స్పష్టంచేశారు. వారి పని, నైపుణ్యానికి గానూ నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఆదాయం పొందేలా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కమల్‌ హామీ ఇచ్చారు. గృహిణులకు వేతన అంశాన్ని తొలుత డిసెంబర్‌లో కమల్‌ ప్రస్తావించారు. అది ఏవిధంగా ఇస్తామనేది తాజా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం ఉండబోదని, ప్రతి మహిళా తమ నైపుణ్యం, పనికి తగిన వేతనం పొందుతారని వివరించారు.

* హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తలెత్తిన గందరగోళంతో సిబ్బంది కౌంటింగ్‌ నిలిపివేశారు. 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌లో 50 ఓట్లు గల్లంతైనట్లు సిబ్బంది తెలిపారు. ఓట్ల గల్లంతుపై భాజపా-కాంగ్రెస్‌ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అక్కడికి కాసేపటి తర్వాత ఆర్వో ఆదేశాలతో ఓట్ల లెక్కింపు మళ్లీ ప్రారంభమైంది.

* భారత ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశంలోని సమీప ఎల్ఐసి కార్యాలయంలో ఎక్కడైనా జమ చేయవచ్చని మార్చి 18న ప్రకటించింది. ఎల్ఐసీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. “పాలసీ హోమ్ బ్రాంచ్ తో సంబంధం లేకుండా, మెచ్యూరిటీ చెల్లింపులు చెల్లించాల్సిన పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ 113 డివిజనల్ కార్యాలయాలు, 2048 శాఖలు, 1526 ఉప కార్యాలయాలు, 74 కస్టమర్ జోన్లలో సమర్పించవచ్చు అని తెలిపింది. అయితే, వాస్తవానికి క్లెయిమ్ ప్రాసెస్ హోమ్ బ్రాంచ్ ద్వారా మాత్రమే చేయబడుతుంది. ఎల్ఐసీ ఆల్ ఇండియా నెట్‌వర్క్ ద్వారా పత్రాలు డిజిటల్‌గా బదిలీ చేయబడతాయి” అని పేర్కొంది.

* అడవి జంతువుల నుంచి మనషులకు జరిగే నష్టం కంటే.. మనుషుల నుంచి జంతువులకు జరిగే నష్టమే అధికంగా ఉంటుంది. మనిషి అడవుల్ని ఆక్రమించి అడవి జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాడు. ఆకలితోనో, దాహంతోనో ఊర్ల బాట పట్టిన వాటిని దారుణంగా హింసించి తరిమేస్తున్నాడు. అడవి జంతువులపై మనుషులు అమానుషంగా ప్రవర్తించిన సంఘటనలు కోకొళ్లలు. గుంపులు గుంపులుగా జనం ఏనుగును వెంటాడుతున్న ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సుధా రమెన్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ మాటల్లేవు.. ఇక్కడ జంతువెవరో నాకు అర్థంకావటం లేదు. ప్రతీ కేసు ఓ ప్రత్యేమైనది. వీటికి ఓ స్థిరమైన పరిస్కారం అంటూ ఉండదు. మనుషుల మానవత్వం లేని చర్యల వల్ల జంతువులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. దీనిపై అవగాహన అవసరం’ అని పేర్కొన్నారు.

* 15 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. వంశపారంపర్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మద్యం అలవాటే వీటికి కారణం. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే 90 శాతం మందిని సాధారణ స్థితికి తేవచ్చు. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి మానసిక ప్రగతికి బ్రేకులు వేశాయి. చిన్న కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ప్రేరణ కావడం లేదు. తోటి స్నేహితులే ప్రేరణగా నిలుస్తున్నారు. వారు మంచివారైతే వీరూ మంచివారవుతున్నారు.. లేదంటే చెడిపోతున్నారు.

* అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్‌ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్‌ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్‌ కిశోరీ పేడ్నేకర్‌ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొందరి ఇళ్లలో తల్లులుగాని, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరుండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.