Business

శుక్రవారం లాభాలతో ముగింపు-వాణిజ్యం

Indian Stock Markets Witness Profits - Business News

* వరుసగా ఐదు రోజుల పాటు నష్టాల్ని మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరకు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు నెమ్మదిగా పైకి ఎగబాకుతూ వచ్చాయి. అనంతరం కిందకు దిగజారి మళ్లీ పైకి లేచాయి. కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకున్నప్పటికీ… కీలక రంగాల్లో మద్దతు లభించడంతో ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. ఉదయం 48,881 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,003 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 48,586 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 641 పాయింట్లు లాభపడి 49,858 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,471 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,788-14,350 మధ్య కదలాడింది. చివరకు 156 పాయింట్లు లాభపడి 14,714 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.52 వద్ద నిలిచింది.

* రైతుల ఆర్థిక చేయూత కోసం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకోని వచ్చింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా అందజేస్తుంది. అంటే ప్రతి విడతలో వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 7 విడతల నగదును జమ చేసింది.

* భారత్‌లో కరోనా మహమ్మారి మూలంగా 2020లో మధ్యతరగతి జనాభా 3.2 కోట్లు తగ్గిందని ప్యూ రీసెర్చి సెంటర్‌ నివేదిక వెల్లడించింది. మరో 7.5 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువకు నెట్టిందని పేర్కొంది. ఈ విషయంలో చైనా మెరుగైన స్థానంలో ఉందని తెలిపింది. ఆ దేశ మధ్యతరగతి జనాభా కోటి మాత్రమే తగ్గిందని పేర్కొంది. ఇక పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

* ఇండియాలో ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అన్ని నగరాల్లోను పెట్రోల్ రూ.90 దాటగా, డీజిల్ ధరలు చాలా చోట్ల రూ.80 దాటాయి. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడటం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. సామాన్య ప్రజానీకం దానికి భిన్నంగా చమురుపై విధించిన పన్నులను తగ్గించాలని కోరుతున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజానీకం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు.