ScienceAndTech

సింగపుర్ జలయజ్ఞం ఆదర్శప్రాయం

సింగపుర్ జలయజ్ఞం ఆదర్శప్రాయం

ధనం మూలం ఇదం జగత్‌… అన్న మాట ప్రపంచంలో ఎక్కడైనా ఆమోదం పొందుతుంది. సింగపూర్‌లో ఈ మాట చెబితే ‘‘నిజమే కానీ, మాకు మాత్రం ‘జలం మూలం ఇదం జగత్‌’ అనేదే అంతకంటే ఎక్కువ నిజం’’ అని చెబుతారు.వారలా చెప్పడం వెనుక కారణాలెన్నో ఉన్నాయి మరి…
**ప్రపంచంలో నీటి కొరతని ఎదుర్కొంటున్న దేశాల్లో సింగపూర్‌ ముందు వరుసలో ఉంది. ఆ దేశ విస్తీర్ణం 700 చ.కి.మీ, జనాభా 55 లక్షలు. విస్తీర్ణం పరంగా 190వ స్థానంలో ఉన్న ఆ దేశం జనసాంద్రత పరంగా మాత్రం మూడో స్థానం(7,697)లో ఉంది. సింగపూర్‌ ప్రధానంగా ఒక నగరం, మరి కొన్ని చిన్న దీవుల సముదాయం. అక్కడ పెద్ద నదులు లేవు. చెప్పుకోదగ్గ సరస్సులూ లేవు. కానీ ప్రజలకీ, పరిశ్రమలకీ రోజూ 40 కోట్ల గ్యాలన్ల నీటి అవసరం ఉంది. 2060 నాటికి నీటి వినియోగం రెట్టింపు అవుతుందనేది ఓ అంచనా.
**మలేషియా నుంచి నీరు…
మలేషియా నుంచి 1965లో వేరు పడి స్వతంత్ర దేశంగా అవతరించింది సింగపూర్‌. అంతకు ముందు(1961) నుంచే సింగపూర్‌కు దగ్గరగా ఉండే మలేషియాలో రాష్ట్రమైన జోహోర్‌లోని ఒక నది నుంచి నీటిని పంపడానికి వందేళ్ల ఒప్పందం ఉంది. మొదట 2011 వరకూ, సమీక్షించుకొని 2061 వరకూ కొనసాగించాలనేది ఆ ఒప్పందం. మొదట్నుంచీ ఈ నదే సింగపూర్‌ నీటి అవసరాల్ని తీరుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ దేశ నీటి అవసరాన్ని 60 శాతం తీరుస్తోంది. జోహోర్‌ నది నీటి నిల్వకి సింగపూర్‌ ఒక రిజర్వాయర్‌ నిర్మించింది. ఒప్పందంలో భాగంగా ఈ రిజర్వాయరులో సేకరించి శుద్ధిచేసిన నీటిలో కొంత జోహోర్‌ రాష్ట్రానికి సింగపూర్‌ పంపిస్తూనే ఉంటుంది. అయినా కూడా కొన్ని అంశాల్లో తాము చెప్పినట్టు వినకపోతే సింగపూర్‌కు నీటి పంపిణీ నిలిపేస్తామని అప్పుడప్పుడూ బెదిరిస్తుంటుంది మలేషియా. అలాంటి ఒక సందర్భంలోనే నీటి వనరుల పరంగా స్వావలంబన అవసరాన్ని గుర్తించింది సింగపూర్‌. మలేషియా అందించే నీటిని ఎంత తక్కువగా వినియోగించుకుంటే తాము ఆ దిశలో అంత విజయవంతమైనట్టు భావించింది. గతేడాది మలేషియాలో కరవు కారణంగా జోహోర్‌ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. నిల్వలు తక్కువ ఉన్నప్పటికీ నిత్యం ఈ రిజర్వాయర్‌ నుంచి నీరు సముద్రంలోకి పంపాలి లేకుంటే సముద్రనీరు రిజర్వాయర్‌వైపుగా వచ్చి మంచి నీరు ఉప్పునీరుగా మారే ప్రమాదం ఉంది.
**వర్షం నీరు
సింగపూర్‌ నీటి అవసరాల్ని తీర్చే ప్రధాన సొంత ఆధారం వర్షం. దాదాపు 20 శాతం అవసరాల్ని వాన నీటితోనే తీర్చుకుంటున్నారు. అక్కడ ప్రతి నీటి బొట్టునీ సేకరించి వినియోగించాలని కొన్ని దశాబ్దాల కిందటే నిర్ణయించారు. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో కాలువల్ని నిర్మించి వాన నీరు మురుగునీటిలో కలవకుండా రిజర్వాయర్లకి మళ్లించారు. దీనికోసం 8000.కి.మీ. పొడవైన కాలువల్ని నిర్మించారు. మొదట్లో వర్షం నీటిలో సగం మాత్రమే సేకరించగలిగేవారు. ఇప్పుడు మూడింట రెండు వంతుల వాన నీటిని ఒడిసిపట్టుకొంటున్నారు. ఎక్కువ వర్షం కురిస్తే ఎక్కువ నీరు దొరుకుతుంది. కాని వర్షాలు పడకుంటే మాత్రం సమస్యే.
**న్యూ వాటర్‌…
మురుగు నీటిని శుద్ధి చేయగా వచ్చిన నీటినే సింగపూర్‌లో ‘న్యూవాటర్‌’గా పిలుస్తున్నారు. 1974 నుంచీ వారు మురుగు నీటి శుద్ధికి సంబంధించిన సాంకేతికతని తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఖర్చు తడిసి మోపెడయ్యేది. 2000 తర్వాతే ఈ దిశలో విజయవంతమయ్యారు. ఇప్పుడక్కడనాలుగు న్యూవాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుత వాడుకలో దీని వాటా 30 శాతం. న్యూ వాటర్‌ని మొదట్లో పరిశ్రమలకే పరిమితం చేయాలనుకున్నారు. మలినాలను పూర్తిగా తొలగించగలిగే సాంకేతికత అందుబాటులో ఉండటంతో తాగునీరుగానూ ఉపయోగిస్తున్నారు. దేశ మొత్తం నీటి వినియోగంలో 2020 నాటికి 40 శాతం, 2060 నాటికి 55 శాతం ‘న్యూ వాటర్‌’ని తీసుకురావాలనేది వారి లక్ష్యం. తగినంత భూభాగం లేకపోవడంతో మురుగు నీటి శుద్ధి కోసం సముద్రంలోపల కొంత భాగాన్నీ, తీరాన్నీ ఉపయోగించుకుని మెరీనా రిజర్వాయర్‌ని నిర్మించారు. ఇక్కడ నీటి అవసరాన్ని తెలియజేసే ఒక మ్యూజియాన్నీ ఏర్పాటుచేశారు.
**సముద్ర జలం
సింగపూర్‌ చుట్టూ సముద్ర జలమే. ఆ జలాలనీ తాగడానికి వీలుగా శుద్ధిచేసి కొంత వరకూ వినియోగిస్తున్నారు. అయితే, మురుగు నీటిని శుద్ధి చేయడంకంటే కూడా దీనికి ఎక్కువ ఖర్చవుతోంది. సముద్ర జలాల్ని శుద్ధిచేసి మొత్తం వాడుకలో వాటిని కనీసం 30 శాతానికి తీసుకు రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇది దాదాపు 10 శాతం. మిగతా దేశాలూ నీటి శుద్ధి, పొదుపైన వినియోగం విషయంలో సింగపూర్‌ మాదిరిగా నిబద్ధత, అప్రమత్తతో ఉండాలని చెబుతారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌. సింగపూర్‌కి ‘గ్లోబల్‌ హైడ్రోహబ్‌’గానూ పేరుంది. అక్కడ నీటి శుద్ధి, మెరుగైన నీటి పంపిణీకి సంబంధించినవే వందకు పైగా కంపెనీలున్నాయి. ఆ దేశ తొలి ప్రధాని ‘లీ కువాన్‌ యూ’ పేరు మీదగా ‘వాటర్‌ ప్రైజ్‌’ని తీసుకొచ్చింది కూడా! ప్రపంచ నీటి అవసరాల్ని తీర్చేందుకు సాంకేతికంగా కృషిచేసే వారికి ఈ అవార్డు అందిస్తారు. అందుకే, అక్కడ ‘జలం మూలం ఇదం జగత్‌’!