Food

తామరతూడు తిన్నారా?

తామరతూడు తిన్నారా?

కమలం లేదా పద్మం అనేది పవిత్ర పుష్పంగానే చాలామందికి పరిచయం. కానీ తోటకూర, కొత్తిమీర, సోయా, వేరుసెనగ మాదిరిగానే తామర కూడా ఓ పంట మొక్కే. పువ్వులుగా కన్నా వాటి కాడలూ గింజల కోసమే దాన్ని ఎక్కువగా పండిస్తుంటారు. ఎందుకంటే అది అందమైన పువ్వుల్నే కాదు, పోషక రుచుల్నీ అందిస్తుంది..!
****ఏ చెరువులోనో అందంగా విరిసిన కమలాన్ని చూసి ముచ్చటపడి ఊరుకోం. దాన్ని ఎలాగోలా తెంపి తీసుకొచ్చి దేవుడికి పెడుతుంటాం. తామరమొక్కతో మన పరిచయం అంతవరకే. లేదంటే ఫూల్‌మఖానాగా పిలిచే తామర గింజలతో కూరలు వండుకోవడం మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ తామరతూళ్లూ లేదా కాడలతో రుచికరమైన వంటకాలెన్నో చేసుకోవచ్చట. కాస్త తియ్యగా కరకరలాడినట్లుగా ఉండే ఈ కాడల కోసమే తామరని కొన్నిచోట్ల ప్రత్యేకంగా పండిస్తుంటారు. మనం వృథాగా పారేసే ఆ కాడ, ఎంతో రుచికరమైనదే కాదు, అందులో ఎన్నో రకాల పోషకాలూ ఉంటాయి. ముఖ్యంగా కశ్మీరీలకి తామరకాడ లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. మన దగ్గర ఆలూనో ఉల్లిగడ్డనో వాడినట్లుగా వాళ్లు అన్ని కూరల్లోనూ తామర కాడల్ని వేస్తారు. వీటినే వాళ్లు కమల్‌ కకడీ లేదా నద్రూ అంటారు. ముఖ్యంగా నద్రూ యాక్నె కూర లేకుండా అక్కడ వేడుక జరగదట. నద్రూ పాలక్‌, నద్రూ కోఫ్తా కర్రీలూ చేస్తుంటారు. మంచూరియా, పకోడీ, కట్లెట్లూ… వంటి స్నాక్సు సరేసరి. వీధి దుకాణాల్లో ఈ కాడలతో చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. హైదరాబాదీ ఇరానీ బిస్కెట్ల మాదిరిగా అక్కడ వీటిని చాయ్‌తో తింటుంటారట. అందుకే కశ్మీరీలు శ్రద్ధగా చెరువుల్లో సరస్సుల్లో తామరని పండిస్తుంటారు. కశ్మీరులోనే కాదు, చైనా, జపాన్‌… వంటి ఆగ్నేయాసియా దేశాల్లోనూ తామరపంట ఎక్కువే. పువ్వుల్ని పూజకోసం ఉపయోగిస్తే, ఆకుల్ని సంప్రదాయ వైద్యంలోనూ గింజల్నీ కాడల్నీ వంటల్లోనూ వాడుతుంటారు.
****పోషకాల పంట!
తామర గింజల్లో మాదిరిగానే తామర కాడల్లో విటమిన్లూ ఖనిజాల శాతం చాలా ఎక్కువ. వంద గ్రా. కాడల్లో రోజువారీ అవసరమయ్యే సి-విటమిన్‌ 70 శాతం దొరుకుతుంది. పీచూ అధికమే. అందుకే మలబద్ధకంతో బాధపడేవాళ్లు వారానికోసారి ఈ కాడల్ని ఉడికించి తింటే చాలు, సమస్య తగ్గిపోతుంది అంటారు కశ్మీరీలు. కొలెస్ట్రాల్‌ కరగడానికీ ఈ పీచు సాయపడుతుంది. ఈ కాడల్లో అధికంగా ఉండే కాల్షియం గుండె పనితీరుని మెరుగుపరచడంతోపాటు ఎముకల వృద్ధికీ తోడ్పడుతుంది. తామర తూడుల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాదు, శరీరంలో వాటి ఉత్పత్తికీ తోడ్పడతాయట. వీటిల్లో ఉన్న ట్రిప్టోఫాన్‌ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ శాతాన్ని తగ్గించి, యాంటీఆక్సిడెంట్ల వృద్ధికి దోహదపడుతుంది.
***తామర కాడల్లో పొటాషియం శాతమూ ఎక్కువే. ఇది బీపీ, మధుమేహం వంటి వాటిని తగ్గిస్తుంది. వీటిల్లోని విటమిన్‌-సి చర్మంలోని టాక్సిన్లను బయటకు పంపించడంతోపాటు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంతో చర్మం మృదువుగా మారుతుంది. ఊబకాయులకి వీటిల్లోని పీచువల్ల చక్కని ఫలితం కనిపిస్తుందట. వీటితో వండిన కూరను అన్నంతో కలిపి తిన్నా రోటీతో తిన్నా త్వరగా ఆకలి వేయదు మరి. రోజువారీ ఆహారంలో నియాసిన్‌, ఫోలేట్‌, బి6, పాంటోథెనిక్‌ ఆమ్లాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి లోపిస్తే మతిమరుపు, చికాకు, ఆందోళన, తలనొప్పి… వంటివి వస్తుంటాయి. ఇవన్నీ తామరకాడల్లో పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మానసిక ఆరోగ్యానికీ ఇవి మేలు అంటున్నారు వైద్యులు. పోతే, రోగనిరోధకశక్తిని పెంచే సి-విటమిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వైరల్‌ ఇన్ఫెక్షన్లూ రాకుండా ఉంటాయి. అందుకేమరి… తామర మొక్క… అందమైన పువ్వుల్నే కాదు, పోషకరుచుల్నీ అందించే పంట మొక్క కూడా!