DailyDose

సూరీడుపై క్రికెట్ బ్యాటుతో దాడి-నేరవార్తలు

Crime News - YS Aide Sureedu Attacked With Cricket Bat

* వైఎస్ అనుచరుడు సూరీడు‍పై అల్లుడు దాడి.జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోకి చొరబడి క్రికెట్ బ్యాట్‍తో దాడి.సూరీడుపై దాడిచేసిన అల్లుడు డా.సురేంద్రనాథ్‍రెడ్డి.గతంలో సురేంద్రనాథ్‍పై గృహ హింస కేసు పెట్టిన సూరీడు కూతురు.కేసులు ఉపసంహరించుకోవడం లేదంటూ సూరీడుపై దాడి.సూరీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదుతో కేసు నమోదు.

* గణపవరం సీఐ డేగల భగవాన్‌ ప్రసాద్‌(42) గుండెపోటుతో మరణించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన స్నేహితులతో కలసి బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వాసుబాబు సోదరుడు కార్తీక్‌ వెంటనే ఆయనను అంబులెన్స్‌లో గణపవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి పీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన భగవాన్‌ప్రసాద్‌ 2003లో కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి, 2007లో ఆర్‌ఎస్‌ఐగా, 2009లో సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితం సీఐగా ప్రమోషన్‌ పొందారు. సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు.

* యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్ల విలువ దాదాపు రూ. 11.63 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అస్సాంలోని గువహటి నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. విదేశాల నుంచి తెప్పించిన బంగారాన్ని హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్‌ చేసి.. బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లోని డీఆర్‌ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది.. హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

* వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్‌ శివారులో మహిళ దారుణహత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని ఈ ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇవాళ భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. సీఐఎస్‌ఎఫ్‌ తనిఖీల్లో రూ.1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు యత్నించిన మొహమ్మద్‌ వద్ద నగదు లభ్యమైంది. అతడిని సీఐఎస్‌ఎఫ్‌ కస్టమ్స్‌ అధికారులకు అప్పగించింది. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

* కంకిపాడులో పట్టపగలే మహిళా దొంగలు కొత్త తరహాలో చోరీకి యత్నించి పట్టుబడ్డారు. పాత కేసులో రెండు నెలల క్రితమే వీరు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కంకిపాడు బస్టాండు సమీపంలో నివసించే ఆటో డ్రైవర్‌ పచ్చిపాల కోటేశ్వరరావు.. తన ఇంటికి గడియ పెట్టి పనులపై బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాత్వితలు వచ్ఛి. గడియపెట్టిన ఇంటి తలుపులు తీసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలోని బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును సంచిలో వేసుకున్నారు. ఇంటిలోకి ప్రవేశించగానే వీరు టీవీ, ఫ్యాన్‌లు వేసుకుని చోరీ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఇంటి యజమాని కోటేశ్వరరావు ఇంటి వద్దకు వచ్చేసరికి తలుపు తీసి ఉండడం టీవీ మోత వినిపించడంతో పక్కనున్న బంధువులను బయటకు రమ్మని పిలిచి అతను లోనికి వెళ్లి చూశాడు. అప్పటికే లోపలున్న మహిళలిద్దరూ ఏమాత్రం తడబడకుండా మీరు ఎవరు? ఎందుకు వచ్చావని సాక్షాత్తు ఇంటి యజమానినే ప్రశ్నించడంతో అతను అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని నా ఇంట్లోకి వచ్చి నన్నే ఎవరని అడుగుతారా? అని గద్దించేసరికి అతని చెయ్యి పట్టుకుని లోపలకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పక్కకు తోసి బయటకు వచ్చిన కోటేశ్వరరావు అప్పటికే అక్కడ పోగయిన బంధువుల సాయంతో వారిని పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహిళా దొంగలిద్దరూ అత్తా కోడళ్లు అవుతారు. కోడలు నెల రోజుల క్రితమే పాపకు జన్మనిచ్చింది. వీరివెంట ఉన్న ఆ పాప డైపర్‌లో కూడా కొన్ని బంగారు ఆభరణాలను దాచడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.