Editorials

తదుపరి CJIగా జస్టిస్ ఎన్.వీ.రమణ పేరు సిఫార్సు-తాజావార్తలు

News Roundup - Justice NV Ramana Referred To President As 48th CJI

* భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్‌ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

* పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రతి నెలా ఠంచనుగా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వాటిలో జీహెచ్‌ఎంసీకి రూ.78 కోట్లు, పురపాలికలకు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడారు. గత ఏడాది పురపాలికలకు రూ. 1,766 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో ప్రతి పురపాలికలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ మార్కెట్లు, 71 పురపాలికల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

* దక్షిణ చైనా సముద్రంలో చైనా మరోసారి తన అరాచకాలను ప్రదర్శించింది. మార్చి 7వ తేదీన వివాదాస్పద జూలియన్‌ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలి వచ్చాయి. సైజులో చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలిపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ ప్రకటించింది. ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫెన్‌ లోరెన్జాన మాట్లాడుతూ ఫిలిప్పీన్స్‌ సముద్ర హక్కులను చైనా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. అక్కడకు వచ్చినవారు మత్సకారులు కాదని.. చైనా సముద్రపు దుండగుల మూక అని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎక్స్‌క్లూజీవ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోనే ఈ ద్వీపం ఉంటుంది. దీంతో ఫిలిప్పీన్స్‌ మిలటరీ చీఫ్‌ కూడా స్పందించారు. తమ దేశ ప్రజలు, భూభాగాన్ని కాపాడటమే ప్రధమ లక్ష్యమని పేర్కొన్నారు. చైనాకు ఫిలిప్పీన్స్‌ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది.

* నెలలో కోటిమందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచి పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టాలని సూచించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రణాళికపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్‌ చేయాలని సూచించారు. లోపాలు సరిదిద్దిన తర్వాత విస్తృతస్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

* ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసును దర్యాప్తు చేసే కొద్దీ సచిన్‌ వాజే క్రిమినల్‌ తెలివి బయటపడుతోంది. తాజాగా ఎన్‌ఐఏ మరిన్ని కొత్త విషయాలను వెలికి తీసింది. పేలుడు పదార్థాలతో స్కార్పియోను కనుగొన్న తర్వాత సచిన్‌ వాజే స్వయంగా వికోర్లి స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. ముఖేశ్‌ హిరేన్‌ ఫిర్యాదుతో నమోదు చేసిన వాహన చోరీ కేసును దర్యాప్తు చేయవద్దని కోరారు. అంతేకాదు.. మరిన్ని వివరాలను ఎన్‌ఐఏ బయటపెట్టింది.

* తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇతర పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు ఆలోచన ఉందా? అంటూ పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానమిచ్చారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర కార్పొరేషన్లలోనూ బస్తీదవాఖానాలు ఏర్పాటు చేస్తామని ఈటల శాసనసభలో వెల్లడించారు. రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతిచ్చారని, క్రమంగా వాటిని విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్బన్‌ పీహెచ్‌సీలు అందుబాటులో లేని ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన సభకు వెల్లడించారు. వైద్యుడితో పాటు ఇద్దరు సిబ్బందితో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు సేవలు అందిస్తున్నామని ఈటల తెలిపారు.

* దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల నిర్వహించనున్న సభకు పోలీసులు అనుమతిచ్చారు. ఏప్రిల్‌ 9న ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మంలోని పెవిలియన్‌ మైదానంలో షర్మిల ఈ సభను నిర్వహించనున్నారు. ఆమె కొత్తగా పార్టీ పెడతారనే ప్రచారం నేపథ్యంలో ఖమ్మం సభకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల వారీగా వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆమె వారితో చర్చించారు. పార్టీ ఏర్పాటుపై అభిమానులు, నేతల అభిప్రాయాలను ఆమె సేకరించినట్లు సమాచారం.

* భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వివరించారు. భారత్‌లో ఇప్పటివరకు సంభవించిన కొవిడ్‌ మరణాల్లో 88% 45ఏళ్లు పైబడినవారేనని వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవువుతుందని స్పష్టంచేశారు. దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10గటల వరకు 5,08,41,286 డోసుల టీకా పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 92శాతం మేర టీకా తొలి డోస్‌ పంపిణీ జరిగిందన్నారు.

* ‘వందేమాతరం’ దేశభక్తి గేయంతో బెంగాల్‌ యావత్‌ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి నేలపై ప్రజలను సీఎం మమతా బెనర్జీ బయటివారిగా పేర్కొంటున్నారని ధ్వజమెత్తారు. భాజపా అధికారంలోకి వస్తే ఈ నేలపై పుట్టినవారినే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన సువేందు అధికారి సొంత ప్రాంతమైన మేదినిపూర్‌ జిల్లాలోని కంటిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బంకించంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి ఎంతో మంది మహనీయులు పుట్టిన నేల బెంగాల్‌ అని కొనియాడారు. ఏ భారతీయుడూ బయటివారు కాదని, అందరూ భరతమాత బిడ్డలేనని వ్యాఖ్యానించారు.

* కర్నూలు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం రేపటితో సాకారం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభకానుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్పీ డాక్టర్‌ పకీరప్ప, ఎమ్యెల్యే రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.