Politics

తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థిగా రత్నప్రభ-తాజావార్తలు

తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థిగా రత్నప్రభ-తాజావార్తలు

* తిరుపతి బ్రేకింగ్…తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ ఐఏఎస్. తిరుపతి భాజపా అభ్యర్థిగా కర్ణాటక మాజీ ఛ్శ్ రత్నప్రభ పేరును ఖరారు చేసిన భాజపా అధిస్టానం. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం.

* మంథని మండలం గుంజపడుగు ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. 18 లక్షల 46 వేల నగదు, 6 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి చోరీకి తెగబడ్డారు. ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పకడ్బందీగా అలారం మ్రోగకుండా బ్యాటరీల కనెక్షన్ తొలగించి, బ్యాటరీలను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు

* ఏపీలో కొత్తగా 758 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి 231 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 3,469 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఉన్న డ్రాయింగ్‌ ఆఫీసర్‌ వ్యవస్థలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు డీడీవోగా పంచాయతీ ఈవోలు ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈవోలను తొలగించి.. డీడీవో స్థానాల్లో వీఆర్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

* విద్యారంగంలో ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కళాశాలల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నాపత్రాలు ఆయా కళాశాల్లో వినియోగించాలని సూచించారు. నాన్‌ అటానమస్‌ కళాశాలలకూ ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయన్నారు. పేపర్‌ వాల్యుయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థి డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని.. నైపుణ్యం లేకుంటే ముఖాముఖి పరీక్ష కూడా ఎదుర్కోలేమని చెప్పారు.

* జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి గత ఇరవై ఏళ్లలో 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చిందని సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది. బంగారంతోపాటు 4,700 కిలోల వెండి, రూ.2000 కోట్ల నగదు ఆలయానికి అందాయని వెల్లడైంది. సామాజిక కార్యకర్త హేమంత్‌ గునియా స.హ చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘వానా కాలం రానున్న నేపథ్యంలో ఆలయ బోర్డు ఈ డబ్బును యాత్రికులకు వసతులు కల్పించేందుకు ఉపయోగించాలి. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి కూడా ఉపయోగించవచ్చు’ అని హేమంత్‌ గునియా తెలిపారు. ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. కరోనా కారణంగా 2020లో కేవలం 17 లక్షల మందే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.

* మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు, సచిన్‌ వాజే ఎపిసోడ్‌ నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు ఆయన వెల్లడించారు.

* కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడ పర్యటించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లడం, అందులోనూ స్నేహపూర్వక పొరుగు దేశమైన బంగ్లాకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తుచేసుకున్నారు.

* రోడ్లు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ఆధ్వర్యంలో ఆరేళ్లలో రూ.17వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆర్‌అండ్‌బీ పద్దుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2014కు ముందు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నుంచి రూ. 1200 కోట్లకు మించి పనులు జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆ శాఖలోని ఉద్యోగులు, ఇంజినీర్లు, ఈఎన్‌సీలను మంత్రి అభినందించారు.

* ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్‌తో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను గంటా కోరారు. దీనిపై స్పీకర్ సీతారామ్‌ స్పందిస్తూ వారం రోజుల్లో అమరావతి వెళ్లి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.