Food

చిన్నా……వెన్న తినరా!

Butter is good for health - Telugu diet news

ఇటీవల నూనెల వాడకం బాగా పెరిగాక వెన్నను గతంలోలా మునపటంత విరివిగా ఉపయోగించడం లేదు. కానీ నిజానికి వెన్న చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలోని కొన్ని పోషకాలూ, వాటితో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. వెన్నలో విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. వెన్నలోని కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ (సీఎల్‌ఏ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నలోని బ్యుటిరేట్‌ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు… ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక… అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని ఈ బ్యుటిరేట్‌. బ్యూటిరేట్‌కు మరో మంచి లక్షణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా అది సమర్థంగా తగ్గిస్తుంది.