Politics

తెలంగాణాలో లాక్‌డౌన్ ఉండదు-తాజావార్తలు

News Roundup - KCR Confirms No LockDown In Telangana

* ‌తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించం అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించొచ్చు. బాధ‌తోనే స్కూళ్ల‌ను మూసివేశాం అని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యాసంస్థ‌ల‌ను తాత్కాలికంగానే మూసివేశామ‌న్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ్ర‌హించాల‌న్నారు.

* రాష్ట్రంలోని అన్ని అటానమస్‌ కళాశాలల్లో అకడమిక్‌ ఆడిట్‌ చేపడతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. అటానమస్‌ ముసుగులో కొన్ని కళాశాలలు నాసిరకం విద్యను అందిస్తున్నాయన్నారు. దీనిపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమకు యూజీసీ ఆమోదం ఉందంటూ ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చని.. దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయొచ్చన్నారు.

* ‘‘వంద శాతం తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కోటి ఎకరాల మాగాణి మా కల.. అది ఇవాళ 1.25 కోట్ల ఎకరాలకు చేరుకుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. వ్యవసాయ రంగంలో 17.73 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. ఒక ఏడాదిలో రూ.లక్ష కోట్ల విలువైన పంట పండించామని.. దేశంలో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ నంచి సేకరించినదేనని చెప్పారు. ఈ విషయాన్ని ఎఫ్‌సీఐ స్వయంగా వెల్లడించిందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగం పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయనే వాదన సరికాదని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువన్నారు. అప్పుల విషయంలో తెలంగాణ దేశంలో 22వ స్థానంలో ఉందని తెలిపారు. కరోనాను తట్టుకుని తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. తీసుకొచ్చిన అప్పులను సద్వినియోగం చేస్తున్నట్లు చెప్పారు. అప్పులతో ప్రాజెక్టులు కట్టామని.. వాటి ఫలితాలు వస్తున్నాయన్నారు. వంద శాతం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

* భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాడ్‌ కూటమిని చైనా వ్యతిరేకించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించే చర్యలు చేపట్టాలని హితవు పలికింది. ఈ మేరకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ నేషనల్‌ డిఫెన్స్‌లోని సీనియర్‌ కర్నల్‌ రెన్‌గావ్‌కియాంగ్‌ పేర్కొన్నారు. అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులైవాన్‌ ఇటీవల చేసిన ప్రకటనకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

* తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని వైద్యులు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్ర వల్ల కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది. బీఎంజే న్యూట్రిషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌ అనే జర్నల్‌లో ఈ మేరకు నివేదికను ప్రచురించారు. నిద్రలేమి.. మానసిక ఒత్తిళ్ల వల్ల శరీరంలో కరోనా వైరస్‌ సులువుగా ప్రవేశించే అవకాశముందట. దాంతోపాటు తీవ్రమైన జబ్బులు, వాటి నుంచి కోలుకోవడానికి దీర్ఘకాలం సమయం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకడంలో నిద్ర ప్రభావంపై పరిశోధన కోసం ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాల్లో కరోనా బాధితులకు చికిత్సలకు అందిస్తూ కరోనా బారిన పడిన హెల్త్‌కేర్‌ వర్కర్లపై సర్వే నిర్వహించారు. వారు ఎంత సేపు నిద్రిస్తారనే విషయంపై దృష్టి సారించి అధ్యయనం చేయగా.. 40శాతం మందికి నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల ప్రభావంతోనే కరోనా సోకినట్లు నిర్థారించారు. కాబట్టి తగినంత నిద్రపోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. రోజువారి నిద్ర కంటే.. గంట ఎక్కువగా నిద్రపోయినా.. ఒక్కో గంటకు కరోనా సోకే అవకాశాలు 12శాతం చొప్పున తగ్గుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

* తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో భద్రాచలంలో 40.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 18.2 డిగ్రీలు నమోదైనట్లు తెలిపింది. హైదరాబాద్‌లో 37.8 డిగ్రీలు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీలుగా నమోదు కాగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 24 డిగ్రీల వరకు ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజులు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

* ఏపీకి జీవనాడిలాంటి పోలవం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిపట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని పాలకులు విస్మరించి ముంపు ప్రాంతవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని చెప్పారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలను తీవ్ర ఖండిస్తున్నట్లు చెప్పారు. జేసీబీలతో ఇళ్లను కూల్చివేసి విద్యుత్‌ సరఫరా సహా ఇతర సదుపాయాలను నిలిపివేయడం గర్హనీయమన్నారు. పుట్టిపెరిగిన ఊళ్లను, జీవనోపాధిని, సాగుభూమిని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గిరిజనులపై ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనేనని చెప్పారు. తమ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడినట్లు పవన్ పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పిన ఎస్సీ రైతులు ఇప్పుడు తనపై ఆరోపణలు చేయడం దారుణమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అన్యాయం జరిగిందని కొందరు ఎస్సీలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆ ఆరోపణలన్నీ సీఐడీ రికార్డు చేసిందని చెప్పారు. ఎస్సీ రైతులను తెదేపా నేతలు భయపెట్టడం వల్లే తిరిగి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆర్కే ఆరోపించారు.

* నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గతంలో భాజపా తరఫున పోటీచేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కంకనాల నివేదితా రెడ్డి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందించారు. భాజపా అధిష్ఠానం అభ్యర్థిగా ఎవర్నీ అధికారికంగా ప్రకటించనప్పటికీ నివేదిత నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

* తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ దక్షిణాది సినీ నటి షకీలా రాజకీయ ప్రవేశం చేశారు. బుధవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో ఆమె పనిచేయనున్నారు. దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. 1995లో 18 ఏళ్ల వయస్సులోనే ‘ప్లేగర్ల్స్‌’ చిత్రంలో నటించారు. గతేడాది ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటించారు.

*