Devotional

నూజివీడు జమీందార్‌లు ఏర్పాటు చేసినదే ఈ జంక్షన్ ఆంజనేయుడు

నూజివీడు జమీందార్‌లు ఏర్పాటు చేసినదే ఈ జంక్షన్ ఆంజనేయుడు

పశ్చిమ–కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది.
స్వామి వారి విగ్రహ స్థాపన ముందు ఈ ప్రాంతాన్ని బాపులపాడు, అప్పనవీడు, ఏవూరు జంక్షన్ అని పిలిచేవారట.విగ్రహ స్థాపన తో హనుమాన్ జంక్షన్ అయింది. దీనికొక చారిత్రిక నేపధ్యమూ ఉంది.
**నూజివీడు జమీందారు ఏం.ఆర్ అప్పారావు గారి తండ్రి మేకా వెంకటాద్రి బహద్దర్ అప్పారావు గారు శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని 1938లో ప్రతిష్ట చేశారు.దీని వెనుక ఒక ఫ్లాష్ బాక్ కూడా ఉంది. ఒకసారి మేకా వెంకటాద్రి అప్పారావు గారు ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా విపరీతమైన అడవులు, రాళ్ళ, గుట్టలు,ముళ్ళ పొదలు తప్ప ఏమీ లేవు. విపరీతంగా ఆకలి వేసింది. ఆహారం కోసం చుట్టుప్రక్కల అంతా వెతికారు దొరక లేదు.. ఆకలి విపరీతమైనది,ఏం చేయాలో పాలుపోలేదు.
ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చి రాజు గారి చేతిలో ఒక అరటిపండు పెట్టి అదృశ్యమైంది .ఆకలితో ఉన్న జమీందార్ గారు ఆ పండును తినేశారు. ఏంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. జరిగిన అద్భుతాన్ని గుర్తుకు తెచ్చుకొని వానర రూపం లో వచ్చినది సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి అని, ఈ ప్రాంతం పరమ పవిత్రమైందని గ్రహించారు. స్వామి వారి అనుగ్రహానికి ముగ్దుడైన జమీందార్ ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేయాలని నిశ్చయించుకొన్నారు .భక్తుల పాలిటి కొంగు బంగారం అయిన స్వామి ,తనకు అరటిపళ్ళు ప్రసాదం గా ఇచ్చిన స్వామిని చేతిలో అరటి పండ్ల గెల ఉండేట్లు నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించి నాలుగు రోడ్ల జంక్షన్ లో ప్రతిష్టించారు. రోడ్డుకు ఎదురుగా శ్రీ రామాలయాన్ని కూడా నిర్మించారు. శ్రీరామునికి కుడివైపు సీతాదేవి ఉండటం ఇక్కడ మరో విశేషం.
*దీనికీ ఒక కధ ఉంది.
త్రేతాయుగంలో సీతారాములు వనవాసానికి వెడుతూ ఇక్కడికి వచ్చారని, దారిలో వారికి ఆకలి అయిందని, వారి ఆకలి తీర్చటానికి హనుమ అరటి పళ్ళు తెస్తూ ‘’రామా ఇవిగో అరటి పళ్ళు‘’ అని పిలవటంతో సీతాదేవి వెనక్కి తిరిగిందట అందుకే రాముడికి కుడి వైపున నిలబడి ఉన్నట్లు ఉంటుంది .
*విగ్రహాన్ని చెక్కిన శిల్పి ప్రసిద్ధులైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దండినీడు సన్యాసి లింగం గారు. స్వామి విగ్రహం సజీవంగా మహా ఆకర్షణీయంగా చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా స్వామి కాపాడుతారు. శ్రీరామనవమికి రామాలయంలో శ్రీరామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. హనుజ్జయంతి వారం రోజుల పాటు మహోత్సవంగా చేస్తారు. జంక్షన్ లో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందు హనుమను దర్శించి పనులు మొదలు పెట్టటం ఆచారం. హనుమాన్ విగ్రహం పశ్చిమ గోదావరి లోను ,దేవాలయం మెట్లు కృష్ణా జిల్లాలోను ఉండటం ఇక్కడ వింత .