Politics

నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు

నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయం మరింత వేడెక్కింది. సాగర్ నుంచి కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రత్యర్థులు డబ్బు మూటలను తీసుకువచ్చి ఇక్కడ వెదజల్లుతున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తగునా? అని ప్రశ్నించారు. సర్పంచ్ లుగా గెలవలేని వాళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణీ అవుతున్నారని విమర్శించారు. ఈ అనుభవ శూన్యులా అభివృద్ధి చేసేది? అంటూ మండిపడ్డారు. సాగర్ కు తానేం చేశానో అడిగే హక్కు ఇతర పార్టీలకు లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తాము నీళ్లు ఇవ్వలేదని అంటున్నారని, కేసీఆర్ వస్తే తాము చేసిన అభివృద్ధిని చూపిస్తామని జానా పేర్కొన్నారు. ఎక్కడో స్విచ్ వేస్తే ఇక్కడ వెలిగే ఇతర పార్టీ నేతల్లా కాకుండా, జానారెడ్డి అంటే ఓ పోరాట యోధుడని తనకు తానే కితాబునిచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండల వ్యవస్థకు ఆద్యుడ్ని తానేనని పేర్కొన్నారు. మండలం ప్రాతిపదికగా ప్రజలకు ఉపాధి లభిస్తోందంటే అది తన ఆలోచన వల్లేనని వివరించారు. ఈ విషయం ఇప్పటివాళ్లకు తెలియదని, కేసీఆర్ కు కొద్దికొద్దిగా తెలిసినా బయటికి చెప్పడని అన్నారు. అంతేకాదు, ఈ దేశంలో అజ్ఞాతంలో ఉన్నవారిని బయటికి రప్పించి శాంతి చర్చలకు బాటలు వేసిన యోధుడు ఎవరు… తానేనని ఉద్ఘాటించారు. కానీ సీఎం కేసీఆర్… జానారెడ్డి ఎవరు అంటాడా? నన్ను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. కాగా ఈ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది.