Agriculture

466వ రోజుకు అమరావతి ఉద్యమం-తాజావార్తలు

News Roundup - Amaravathi Protest Reaches 466th Day

* రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 466వ రోజుకు చేరుకున్నాయి.మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.మరోవైపు విశాఖ ఉక్కు సాధిస్తామని అమరావతి రైతులు స్పష్టం చేశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.

* దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.తాజాగా గత 24 గంటల వ్యవధిలో 59,118 మంది మహమ్మారి బారిన పడ్డారు.ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి.వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసులు 1,18,46,652కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మహమ్మారి కారణంగా మరో 257 మంది కన్నుమూశారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 1,60,949కు పెరిగింది.క్రియాశీల కేసులు 4,21,066 (మొత్తం కేసుల్లో 3.55%)కు పెరిగాయి.దేశంలో రికవరీ రేటు 95.09%కి పడిపోయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.

* ఖమ్మంలో ఈ రోజు ఉదయం వేంసూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ ఉపేందర్.. సాంబశివరావు అనే రైతు భూమీ సర్వే చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి పట్టించిన రైతు సాంబశివరావు..

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,97,810 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,203గా ఉంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 377 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,85,892కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,58,897 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 180.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

* హోలీ, ఈస్టర్​, ఈద్​ పండగలు రానున్న నేపథ్యంలో జనం గుంపులుగా ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

* దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆయన నిన్న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.వైద్యులు ఆయనకు సాధారణ వైద్యపరీక్షలు నిర్వహించి అబ్జర్వేషన్‌లో ఉంచారు.రాష్ట్రపతి ఆరోగ్యంపై శనివారం ఉదయం ఆర్మీ ఆసుపత్రి బులిటెన్‌ విడుదల చేసింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన ఆసుపత్రి వర్గాలు..తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రపతిని ఎయిమ్స్‌కు పంపించనున్నట్లు తెలిపాయి.

* ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ తెరకెక్కించిన ‘వేదం’ చిత్రంలో పల్లెటూరి వృద్ధుని పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించిన నాగయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో రాములు పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆ తర్వాత ఆనేక చిత్రాల్లో ఆయనకు అవకాశాలు వచ్చాయి.

* లాటరీ తగిలిన టికెట్‌ ఎవరి వద్ద ఉంటే వారికే డబ్బులు ఇస్తారు. కానీ, ఫోన్‌ ద్వారానే లాటరీ టికెట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికే డబ్బులు ఇచ్చి తమ నిజాయతీని చాటుకున్నారు కేరళలోని ఎర్నాకుళానికి చెందిన దంపతులు. ఎర్నాకుళంలోని వలంబుర్‌కక్కనాడ్‌కు చెందిన దంపతులు స్మిజా కే మోహన్, రాజేశ్వరన్‌లు లాటరీ టికెట్లు విక్రయిస్తుంటారు. రోజూలాగానే గత ఆదివారం రాజగిరి ఆసుపత్రికి సమీపంలో లాటరీ టికెట్లను అమ్ముతున్నారు. 12 టికెట్లు మినహా అన్నీ అమ్ముడుపోయాయి. వీటిని అమ్మి ఇంటికి వెళదామంటే ఎవరూ కొనడం లేదు. తరచుగా తన దగ్గర టికెట్లు కొనే వారికి సమాచారం అందించి తీసుకోవాలని చెప్పారు స్మిజా. వారిలో పాలచోటిల్‌కు చెందిన పీకే చంద్రన్‌ ఉన్నారు. అతనికి ఫోన్‌ చేసి టికెట్‌ కొనాల్సిందిగా కోరారు. అయితే టికెట్‌ కొనడానికి కావల్సిన రూ.200 తన దగ్గర ఇప్పుడు లేవని మరునాడు ఇస్తానని అన్నాడు. సరే అని ఫోన్‌లోనే టికెట్‌ నంబర్‌ చెప్పారు స్మిజా.మరుసటి రోజు లక్కీడ్రా తీయగా అతనికి చెప్పిన టికెట్టు నంబర్‌కే రూ.6 కోట్లు వచ్చాయి. ఆ వెంటనే చంద్రన్‌ ఇంటికి వెళ్లి.. లాటరీలో రూ.6 కోట్లు గెలుచుకున్నాడని స్మిజా దంపతులు చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి టికెట్‌ రుసుం రూ.200 తీసుకున్నారు.

* విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇక్కడ వసతి గృహాల్లో ఉంటున్న పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల వ్యవధిలో 83 మంది విద్యార్థులకు వైరస్‌ నిర్ధారణ అయింది. శుక్రవారం 200మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 53 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే శనివారం 600మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా మరో 30 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, ప్రాంతీయ కొవిడ్‌ నోడల్‌ అధికారి డా. పీవీ సుధాకర్‌, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. సూర్యనారాయణ సహా అధికారుల బృందం వసతి గృహాలను శనివారం సందర్శించి పరిశీలించింది. వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు బయటపడిన పాజిటివ్‌ కేసుల్లో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని.. కొంతమందికి మాత్రం కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. వారందరినీ ప్రత్యేక గదిలో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

* రాష్ట్రంలో కొవిడ్‌ స్థితిగతులపై విద్యాశాఖ అధికారులతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్‌ క్యాలెండర్‌ గాడిలో పెట్టాం. కొవిడ్‌ కేసులు వచ్చిన విద్యాసంస్థలు వెంటనే మూసేయాలి. పెద్ద ఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుంది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశాం. కొవిడ్‌ మళ్లీ పుంజుకుంటోంది. రెండు నెలలు జాగ్రత్త అవసరం. రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకింది. కరోనా సోకినవారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతాం. ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తాం’’ అని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.

* మహారాష్ట్ర ‘లేడీ సింగమ్‌’గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి దీపాలీ చవాన్‌(28) ఆత్మహత్య చేసుకున్నారు. భారత అటవీ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు(ఎంటీఆర్‌) సమీపంలోని హరిసాల్‌ గ్రామంలోని తన అధికారిక నివాసం(క్వార్టర్స్‌)లో గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమె సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్‌ ‘లేడీ సింగమ్‌’గా పేరు సంపాదించుకున్నారు. ఆమె భర్త రాజేశ్‌ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారి. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. దీపాలీ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌(డీసీఎఫ్‌) వినోద్‌ శివకుమార్‌ను పోలీసులు నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించి కేసు నమోదు చేశారు. శివకుమార్‌ తనను కొన్ని నెలలుగా లైంగికంగా, మానసికంగా ఎలా వేధించిందీ దీపాలీ ఆ లేఖలో వివరించారు. శివకుమార్‌ ఆగడాలపై పలుమార్లు ఆయన సీనియర్‌, ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న దీపాలీని మూడు రోజుల పాటు పెట్రోలింగ్‌ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్‌ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భిణి అన్న విషయం తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడిపించాడని, గర్భస్రావం కావడంతో దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైందని వివరించారు. దీపాలి లేఖలోని ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ… అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టబోమన్నారు. నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్‌(మంత్రాలయ) అరవింద్‌ ఆప్టే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలను మరొక అధికారికి బదిలీ చేసినట్లు అరవింద్‌ ఆప్టే వెల్లడించారు.

* ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు(దక్షిణ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. తొలి నుంచి కమల్‌ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న నటి సుహాసిని.. కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించారు. పార్టీ గుర్తు టార్చ్‌లైట్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

* ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో వారి నుంచి విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందికి వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో స్వామివారి ఆర్జిత సేవలను ఆదివారం నుంచి నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేవలం దైవదర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన 16మందికి, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు వెల్లడించారు.

* చిత్తూరు జిల్లాలోని కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ (రెస్కో) స్వాధీనానికి ఏపీఎస్పీడీసీఎల్‌కు ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. విద్యుత్ అమ్మకం, పంపిణీ, రిటైల్ లైసెన్స్ మినహాయింపులు పొందడంలో విఫలమైందనే కారణాలు చూపుతూ రెస్కోను స్వాధీనం చేసుకునే ఏకపక్ష చర్య సరైంది కాదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆయన లేఖ రాశారు. ఎంతో వెనుకబడిన మారుమూల ప్రాంతమైన కుప్పంలో నూరుశాతం విద్యుదీకరణ లక్ష్యంతో 1981లో రెస్కోను స్థాపించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. దాదాపు 1,22,000 మంది వాటాదారులుగా ఉన్న ఈ సంస్థకు 1,24,000 గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. స్థాపించిన నాటి నుంచి విజయవంతంగా నడుస్తున్న రెస్కోను చిన్న కారణంతో ఏపీఎస్పీడీసీఎల్‌లో విలీనం చేయడం అర్థంలేని చర్య అని ఆక్షేపించారు. కుప్పం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీఈఆర్‌సీ తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో నిరాశకు గురిచేసిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.