Business

₹1285కోట్లు రుణం ఎగ్గొట్టిన మాదాపూర్ హోటల్-వాణిజ్యం

₹1285కోట్లు రుణం ఎగ్గొట్టిన మాదాపూర్ హోటల్-వాణిజ్యం

* బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై మాదాపూర్‌ శిల్పకళా వేదిక పక్కన ఉన్న గోల్డెన్‌ జూబ్లీ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.1,285 కోట్లకుపైగా రుణం ఎగవేసినట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) కో-ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అశుతోష్‌ బాజ్‌పాయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. హోటల్‌ ఎండీ, సీఈవో లక్ష్మీ నారాయణ్‌ శర్మ, డైరెక్టర్లు అర్జున్‌ సింగ్‌ ఒబెరాయ్‌, నేహా గంభీర్‌, యష్‌దీప్‌ శర్మలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 2009 నుంచి 2015 వరకు టర్మ్‌ లోన్ల పేరిట రూ.678.89 కోట్లు, బ్యాంక్‌ పూచీకత్తుల కింద మరో రూ.50 కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతోపాటు తిరిగి చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయినట్టు ఫిర్యాదులో బ్యాంకర్లు పేర్కొన్నారు. ఇలా మొత్తం రూ.1285.45 కోట్ల బకాయిని బీవోబీ నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్షియంకు చెల్లించాల్సి ఉన్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకుల్లో కార్పొరేషన్‌, పీఎన్‌బీ, పంజాబ్‌ అండ్‌ సింధ్‌, సిండికేట్‌, జమ్ము అండ్‌ కశ్మీర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నాయి. కాగా, నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 120-బి, రెడ్‌విత్‌ 420, పీసీయాక్ట్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1),(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఒబెరాయ్‌ నివాసంసహా హైదరాబాద్‌, ఢిల్లీల్లో సీబీఐ అధికారులు సోదాలు సైతం నిర్వహించారు. ఈఐహెచ్‌ లిమిటెడ్‌ ఎండీగా కూడా ఒబెరాయ్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

* వాహన సంస్థలకు గిరాకీ నెలకొన్నది. వాహన తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్‌, టాటా మోటర్స్‌లు గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా వ్యక్తిగత వాహనాలకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడం ఇందుకు కారణం. వీటితోపాటు టయోటా, హోండా కార్స్‌, మహీంద్రాలకు చెందిన వాహనాలకు కూడా కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించింది. ఈ నెల నుంచి వాహన ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. మారుతి, హ్యుందాయ్‌ అమ్మకాలు ఇంచుమిం చు రెండు రెట్లు పెరుగగా, టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు నాలుగు రెట్లకంటే అధికంగా పెరిగాయి.

* చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్ల తగ్గింపులో మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. వడ్డీ కోతల నిర్ణయం తీసుకున్న 12 గంటల్లోపే యూటర్న్‌ చేసుకున్నది. పైగా దీన్ని పర్యవేక్షణ లోపంగా అభివర్ణించింది. ఈ క్రమంలోనే తమ ఈ పొరపాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే బెంగాల్‌, అస్సోంసహా మరో 3 రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో మా త్రం ఈ వ్యవహారం అత్యం త ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) తదితర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీరేట్లను బుధవారం కేంద్రం భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీతోపాటు ఏడాది నుంచి ఐదేండ్ల టర్మ్‌ డిపాజిట్లు, ఐదేండ్ల రికరింగ్‌ డిపాజిట్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌, మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర వడ్డీరేట్లను ఏకంగా 1.1 శాతం వరకు కోత పెట్టారు. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో తగ్గింపు ఇదే తొలిసారి. ఈ క్రమంలో మార్చి 31 నాటికి ఉన్న వడ్డీరేట్లే ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికీ వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

* అమెజాన్‌తో న్యాయ పోరాటం నేప‌థ్యంలో కిశోర్‌ బియానీ సార‌ధ్యంలోని ఫ్యూచర్ రిటైల్‌ గ్రూప్‌కు రిల‌య‌న్స్ రిటైల్ వెంచ‌ర్స్ లైఫ్‌లైన్ ఇచ్చింది. రెండు సంస్థ‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం అమ‌లు స‌మ‌యాన్ని మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తున్న‌ట్లు రిల‌య‌న్స్ రిటైల్ వెంచ‌ర్స్ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఇంత‌కుముందు రిల‌య‌న్స్ రిటైల్‌లో విలీనం కోసం చేసుకున్న ఒప్పందం అమ‌లు చేయ‌డానికి ఫ్యూచ‌ర్ రిటైల్ గ్రూప్‌కు గ‌త నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించింది.

* మార్ట్‌గేజ్‌ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌..పలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీరేట్లు మార్చి 30 నుంచి అమలులోకి వచ్చాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.