Food

బ్రెడ్ ఫ్రిజ్‌లో పెట్టకూడదు

పండ్లు, కూర‌గాయ‌లు తొంద‌ర‌గా పాడ‌వ్వ‌ద్ద‌ని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అవే కాకుండా వండిన అన్నం, కూర‌లు, ఇత‌ర వంట‌కాల‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌డం కామ‌న్ అయిపోయింది. మ‌రి ఇలా అన్ని ఆహార ప‌దార్థాల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌డం మంచిదేనా? అస‌లు వేటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. వేటిని ఉంచ‌కూడ‌దో తెలుసా..

చ‌ట్నీలు, తొక్కుల‌ను కూడా చాలామంది ఫ్రిజ్‌లో పెడుతూనే ఉంటారు. సూర్య‌కాంతి ప‌డ‌కుండా తొక్కుల‌ను రెండు మూడేళ్ల పాటు నిల్వ చేయ‌వ‌చ్చు. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల అందులోని చ‌ల్ల‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌కు తొక్కులు తొంద‌ర‌గా పాడ‌వుతాయి.

త్వ‌ర‌గా పాడైపోతుందేమోన‌ని బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌డం వ‌ల్ల అది డ్రైగా మారుతుంది. ఎక్కువ రోజులు అలాగే ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టే అవ‌కాశం కూడా ఉంది. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు బ్రెడ్‌ను గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ‌ చేయ‌డం మంచిది.

మున‌క్కాయ‌ల‌ను ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల కొయ్య ముక్క‌ల్లా త‌యార‌వుతాయి. కాబ‌ట్టి వీటిని గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేయ‌డ‌మే ఉత్త‌మం.

దోస‌కాయ‌ల‌ను క‌ట్ చేశాక ఫ్రిజ్‌లో పెట్ట‌డం వ‌ల్ల అందులోని పోష‌కాలు త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి దోస‌కాయ ముక్క‌ల‌ను తిన‌డానికి బ‌దులు.. చ‌ల‌వ చేసేందుకు కంటిపై రుద్దుకునేందుకు మాత్ర‌మే వాడండి

తేనెను ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల తొంద‌ర‌గా చిక్క‌బ‌డి.. గ‌ట్టిగా త‌యార‌వుతుంది. అప్పుడు దాన్ని వాడ‌టం క‌ష్ట‌మైపోతుంది. కొంత‌మంది నూనెల‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అది మంచిది కాదు. గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్దే నూనెల‌ను ఉంచ‌డం మంచిది. కాఫీ పౌడ‌ర్‌ను కూడా ఫ్రిజ్‌లో పెడితే రుచి పోతుంది.

అవ‌కాడో, అర‌టి, బెర్రీలు, ఆఫ్రికాట్లు, సిట్ర‌స్ పండ్ల‌ను రిఫ్రిజిరేట‌ర్‌లో పెట్ట‌డం వ‌ల్ల వాటి రుచి మారిపోతుంది. కాబ‌ట్టి వాటిని అస‌లు ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు.

క్రీం బిస్కెట్లు, కాక్లెట్లు, పండ్లు, ఆకుకూరలు, ప‌చ్చి కొబ్బ‌రి, పాలు, పెరుగు, కొబ్బ‌రి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయ‌వ‌చ్చు. కండ్లు, చెవుల్లో వేసుకునే చుక్క‌ల మందును కూడా ఫ్రిజ్‌లో ఉంచ‌వ‌చ్చు.

పుచ్చ‌కాయ‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. కొంత‌మంది క‌ట్ చేసిన ముక్క‌ల‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా పుచ్చ‌కాయ‌ను ఫ్రిజ్‌లో ఉంచితే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు త‌గ్గిపోతాయి. దీంతో తియ్య‌గా ఉండాల్సిన పుచ్చ‌కాయ‌.. చ‌ప్ప‌గా మారిపోతుంది. అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల్ల అనారోగ్యం బారిన కూడా ప‌డ‌తారు.

టమాటాల‌ను ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే ప‌లుచ‌టి పొర ముడ‌త‌లు ప‌డిపోయి.. అందులోని విట‌మిన్ సి త‌గ్గిపోతుంది. అలాగే ట‌మాటాల రుచి కూడా పోతుంది. అందుకే ట‌మాటాల‌ను ఫ్రిజ్‌లో ఉంచ‌కూడ‌దు. వీలైనంత వ‌ర‌కు గాలి త‌గిలే ప్ర‌దేశంలో ఉంచ‌డ‌మే మంచిద‌ని న్యూట్రిషియ‌న్లు అంటున్నారు

ట‌మాటాల మాదిరిగానే ఉల్లిగ‌డ్డ‌ల‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. ఉల్లిపాయ‌ల్లో అధిక నీటి శాతం ఉండ‌టం వ‌ల్ల ఫ్రిజ్‌లోని చ‌ల్ల‌ద‌నానికి అవి ఐస్‌లా మారి పొర‌ల‌ను బాగా ద‌గ్గ‌ర‌కు చేరుస్తుంది. ఆలుగ‌డ్డ‌ల‌తో క‌లిపి ఉల్లిగ‌డ్డ‌ల‌ను నిల్వ చేస్తే త్వ‌ర‌గా పాడ‌వుతాయి.

ఉల్లిగ‌డ్డ‌ల‌ను క‌వ‌ర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టినా స‌రే త్వ‌ర‌గా వాస‌న‌ప‌ట్టేస్తాయి. ఈ వాస‌న వ‌ల్ల ఫ్రిజ్‌లోపెట్టిన ఇత‌ర ఆహార ప‌దార్థాలు కూడా పాడ‌య్యే ప్ర‌మాదం ఉంది. అందువ‌ల్ల ఉల్లిగ‌డ్డ‌ల‌ను పేప‌ర్ బ్యాగులో నిల్వ చేయ‌డ‌మే మంచిది

పుదీనా ఆకుల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు. పుదీనాను ఫ్రిజ్‌లో ఉంచ‌డంవ‌ల్ల ఆకులు న‌ల్ల‌గా మార‌తాయి. అలాంటి ఆకుల‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తే ఆహారం విష‌తుల్యం అవుతుంది. అందువ‌ల్ల తుల‌సి ఆకుల‌ను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో ఉంచ‌కూడ‌దు.

ఆలుగ‌డ్డ‌ల‌ను ఫ్రిజ్‌లో ఉంచిన‌ప్పుడు వాటిపై తొక్క‌లోని తేమ ఆవిరై గట్టిప‌డుతుంది. దీనివ‌ల్ల ముక్క‌లు త‌ర‌గ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అలాగే లోప‌ల ఉండే పిండి ప‌దార్థం తేమ‌ను పూర్తిగా కోల్పోతుంది. ఫ‌లితంగా వంట‌కాలు రుచి ప‌చి లేకుండా చ‌ప్ప‌గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉండే చ‌ల్ల‌ని ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా ఆలుగ‌డ్డ‌ల్లో చ‌క్కెర శాతం త్వ‌ర‌గా పెరిగే అవ‌కాశం ఉంది. నీటితో శుభ్రం చేయ‌కుండా, పేప‌ర్ బ్యాగ్‌లో పెట్టి అలాగే ఉంచినా నిల్వ ఉంటాయి.