Business

హీరో సంస్థ కీలక నిర్ణయం-వాణిజ్యం

హీరో సంస్థ కీలక నిర్ణయం-వాణిజ్యం

* విద్యుత్తు వాహనాలకు క్రమంగా గిరాకీ పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తమ వినియోగదారులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేలా రోడ్డు పక్కన ఉండే సాధారణ మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రానున్న మూడేళ్లలో మొత్తం 20 వేల మందికి ట్రైనింగ్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసేవారిలోనూ విశ్వాసం పెరుగుతుందని ఆశిస్తోంది.

* దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం కలకలంరేపింది. హ్యాకర్లు సులువుగా ఈ సమాచారం పొందేలా ఓ వెబ్‌సైట్‌లో ఈ వివరాల్ని ఉంచినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇందులో 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్‌ ఐడీలు, చిరునామాలు ఉన్నట్లు తెలిపింది.

* స్టాక్‌ మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి పది కంపెనీల్లో ఎనిమిదింటి విలువ గతవారం గణనీయంగా వృద్ధి చెందింది. మార్కెట్ల ఒడుదొడుకుల నేపథ్యంలో అంతకుముందు రెండు వారాలు విలువ కోల్పోయిన పలు కంపెనీలు ఈ వారం పుంజుకోవడం విశేషం. గడిచిన వారంలో మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బీఎస్‌ఈ సూచీ రెండు శాతం ఎగబాకడం విశేషం.

* ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త లోగోను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఈ లోగో తయారీ కోసం 3 లక్షల డాలర్లు(సుమారు రూ.2.2 కోట్లు) ఖర్చు, నాలుగు సంవత్సరాల కాలం పట్టినట్లు షియోమీ పేర్కొంది. ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, అసలు లోగోకు కొత్త లోగోకు మధ్య తేడా ఏమి లేదు అనే కదా. షియోమీ దీనిని ‘అలైవ్’ డిజైన్ కాన్సెప్ట్‌తో ప్రపంచ ప్రముఖ డిజైనర్, జపాన్‌లోని ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్యా హరా డిజైన్ చేశారు.