Business

ఆల్‌టైం అత్యధిక ధరకు చేరిన చికెన్

ఆల్‌టైం అత్యధిక ధరకు చేరిన చికెన్

చికెన్‌ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.306కు చేరి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు తోడు కోళ్ల కొరత వల్ల చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కోవిడ్‌కు ముందు వరకు చికెన్‌ రేటు అధికంగానే (కిలో రూ.270 వరకు) ఉండేది. కోవిడ్‌ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్‌తో నాలుగైదు నెలల పాటు చికెన్‌ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక దశలో మూడు కిలోల చికెన్‌ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్‌ ధర పెరగడం మొదలైంది. విజయవాడ జోన్‌లో గత డిసెంబర్‌ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో చికెన్‌ రేటు మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. దాన్ని కూడా అధిగమించి.. చికెన్‌ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్‌ 2న రూ.270, ఏప్రిల్‌ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది.