Editorials

యువ న్యాయవాదులే మార్గనిర్దేశకులు

Justice NV Ramana At DSNLU Convocation Says Young Lawyers Are Powerful

రాజ్యం లేదా సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితుల పక్షాన యువ న్యాయవాదులు నిలబడి, చట్టపరంగా ఆ చర్యలను బలంగా తిప్పికొట్టాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించటంతో పాటు అవసరమైనప్పుడు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఇవన్నీ బరువైన బాధ్యతలే అయినా.. వాటిని యువ న్యాయవాదులు సమర్థంగా మోయగలరని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజం మాట్లాడాల్సిన సందర్భంలో మౌనంగా ఉండటం పిరికితనమేనన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యల్ని గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మార్పు మార్గనిర్దేశకులుగా యువతపై ఎంతో బాధ్యత ఉందని, మాట్లాడలేని వారి తరఫున గళం వినిపించాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న నైపుణ్యాల్ని చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ లా) పరిరక్షణ కోసం వినియోగించాలన్నారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 4, 5, 6, 7వ స్నాతకోత్సవాలు వర్చువల్‌ విధానంలో ఆదివారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి స్నాతకోత్సవాన్ని నిర్వహించి పట్టభద్రుల వివరాల్ని ప్రకటించారు. ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌.సూర్యప్రకాశ్‌, రిజిస్ట్రార్‌ ఇన్‌ఛార్జి కె.మధుసూదనరావు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్నాతకోపన్యాసం చేస్తూ.. సమాజానికి తిరిగివ్వడం నాగరిక పౌరుడి లక్షణమన్నారు. యువ న్యాయవాదులు తాము ఎదిగి వచ్చిన సమాజాన్ని, తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశాన్ని వెనుదిరిగి చూడాలని సూచించారు. మన సంస్కృతి, గొప్ప తత్వవేత్తల విజ్ఞానం, కాలపరీక్షకు నిలబడిన విలువల ఆధారంగా ముందుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఆయన ప్రసంగంలోని ప్రధానాంశాలివీ..

* పెండింగ్‌ కేసులకు నాసిరకం న్యాయవిద్య కూడా ఓ కారణం
* ఒత్తిడి, క్లిష్ట పరిస్థితుల మధ్య పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
* మా కుటుంబంలో తొలితరం పట్టభద్రుణ్ని
* న్యాయ పట్టభద్రులు సామాజిక ఇంజినీర్లుగా ఉండాలి
* దామోదరం సంజీవయ్యది విలువలతో కూడిన జీవితం

భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆదివారం శ్రీశైలం వచ్చారు. స్థానిక నందినీకేతన్‌ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఖాజా మొహిద్దీన్‌, జిల్లా జడ్జి డాక్టర్‌ రాధాకృష్ణ కృపాసాగర్‌, దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన్‌ ఉదయ్‌ ప్రకాశ్‌ సాదర స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తి వెంట డీఎస్పీ శ్రుతి, స్థానిక తహసీల్దారు రాజేంద్రసింగ్‌ తదితరులు ఉన్నారు.