Food

మిరియాలతో రోగనిరోధక శక్తి

Peppers Help To Boost Immune System

తొలకరి మొదలైంది. ఆడపాదడపా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే… వ్యాధినిరోధకశక్తి తగ్గకుండా చూసుకోవాలి. అందుకేం చేయాలంటే…ఈ సమయంలో రోగనిరోధకశక్తి తగ్గడంతోపాటూ ఆకలి కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు కూడా మందగిస్తుంది. ఈ రెండే అనారోగ్యాలకు దారితీస్తాయి. అతిసారం, కామెర్లూ, జ్వరాలు త్వరగా వ్యాపిస్తాయి. అందుకే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఈ సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలను మాత్రమే ఎంచుకోవాలి. ఏ పూటకాపూట వండినవీ, వేడిగా ఉన్న పదార్థాలను మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి. చల్లారి, నిల్వ ఉన్నవాటిలో హానికరమైన సూక్ష్మజీవులు పెరిగి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. మాంసాహారం అయితే చాలా త్వరగా కలుషితం అవుతుంది. అందుకే వానాకాలంలో వీలైనంత తక్కువగా మాంసాహారాన్ని ఎంచుకోవాలి. దుంపలూ, ఆకుకూరల్ని కూడా మితంగా తీసుకుంటేనే మంచిది.
*మిరియాలు ఎక్కువగా… మంచినీళ్లు దాదాపు 10 నిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత వడకట్టి చల్లార్చి తాగాలి. లేదంటే గోరువెచ్చగా అయినా తీసుకోవచ్చు. పదార్థాల్లో మిరియాలూ, శొంఠీ, లవంగాలు వీలైనంత ఎక్కువగా వాడాలి. ఇవి జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి.
***ఇలా చేయొచ్చు…
* కప్పు పాలల్లో పావుచెంచా శొంఠిపొడీ, కొద్దిగా పటికబెల్లం కలపాలి. దీన్ని తరచూ తీసుకుంటే దగ్గూ, జ్వరం, అజీర్తి బాధించవు. కొందరికి పాలు నచ్చకపోవచ్చు. అలాంటివాళ్లు కప్పు నీళ్లను మరిగించి, అందులో చెంచా శొంఠిపొడి వేసి మరొకసారి బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక కాస్త బెల్లం కలిపి తాగాలి. ఇలా రోజుకోసారి తీసుకోవాలి. అలాగే కప్పు వేడిపాలల్లో చెంచా పసుపు కలిపి తాగితే ఎలర్జీ సమస్య కూడా బాధించదు.
* శొంఠీ, పిప్పళ్లు, మిరియాలు, తిప్పతీగ – ఈ నాలుగింటినీ సమానపాళ్లలో తీసుకుని విడివిడిగా చూర్ణాలు చేసుకోవాలి. అన్నింటినీ తెల్లని, పల్చని వస్త్రంలో జల్లించాలి. వీటన్నింటినీ కలిపి ఓ సీసాలోకి తీసుకోవాలి. ప్రతీరోజూ అరచెంచా పొడిలో కొద్దిగా తేనె, నెయ్యి కలిపి తీసుకోవాలి. అయితే తేనె కన్నా నెయ్యి మోతాదు ఎక్కువగా ఉండాలి. దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. లేదంటే కప్పు నీళ్లలో ఇదే మిశ్రమాన్ని చెంచా కలిపి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు సగం అయ్యాక దింపేసి సరిపడా బెల్లం కలిపి గోరువెచ్చగా తాగినా మంచిదే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.