NRI-NRT

తానాలో నాలుగు రికార్డులు నెలకొల్పిన ముత్యాల పద్మశ్రీ-TNI ప్రత్యేకం

The only women president of TANA - Mutyala Padmasri

ప్రపంచంలో పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొంది నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చరిత్రలో ఒక మహిళ నాలుగు రికార్డులను నెలకొల్పింది. తానాకు ఇప్పటి వరకు చాలా మంది హేమాహేమీలు అధ్యక్షులుగా పనిచేశారు. తానా చరిత్రలో అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నిక కావడం చాలా విశేషం. ఆమె మహిళగా ఎన్నిక కావడమే కాకుండా మరికొన్ని రికార్డులను నెలకొల్పారు. హ్యూస్టన్ నగరంలో నివాసం ఉంటున్న ముత్యాల పద్మశ్రీ తానాలో నెలకొల్పిన రికార్డులు ఆ సంస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

*** ముత్యాల పద్మశ్రీ “తానా” ప్రస్థానం ఇది
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ముత్యాల పద్మశ్రీ ముత్యాల రాజా చౌదరిని వివాహం చేసుకొని 1981లో అమెరికాలో అడుగు పెట్టారు. 1983 నుండి ఆమెకు తానా సంస్థతో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుండి తానా ఆధ్వర్యంలో నిర్వహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు పద్మశ్రీ సర్థ్యం వహించేవారు. 1989లో నల్లమోతు సత్యనారాయణ తానా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో పద్మశ్రీలో ఉన్న చురుకుదనాన్ని గుర్తించి ఆమెను ప్రోత్సహించారు. తానా కల్చరల్ విభాగం ఛైర్‌పర్సన్‌గా నియమించారు. 1993లో న్యూయార్క్ నగరంలో నిర్వహించిన తానా మహాసభలు ప్రపంచ తెలుగు మహాసభలుగా గుర్తింపు పొందాయి. ఆ మహాసభలకు అమెరికాతో పాటు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 15వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు పద్మశ్రీ సామర్థ్యానికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అనంతరం 1995 ప్రాంతంలో పద్మశ్రీ టెక్సాస్ రాష్ట్రం నుండి తానా రీజనరల్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.

The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

*** 1999లో అధ్యక్ష పదవికి పోటీ
1999లో జరిగిన తానా ఎన్నికలు అప్పటికీ, ఇప్పటికీ ఒక చరిత్రగానే గుర్తుండిపోతాయి. 38 సంవత్సరాల అతి చిన్న వయసులో ముత్యాల పద్మశ్రీ తానాకు అందిస్తున్న విలువైన సేవలను గుర్తించిన అప్పటి తానా పెద్దలు చాలా మంది పద్మశ్రీని అధ్యక్ష పదవికి పోటీలో ఉండమని ప్రోత్సహించారు. డాక్టర్ ముక్కామల అప్పారావు, తుమ్మల మాధవరావు, నల్లమోతు సత్యనారాయణ తదితరులు పద్మశ్రీకి మద్దతుగా నిలిచారు. చాలా చిన్న వయసులో ఉన్న ఒక మహిళ తానా అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఏమిటని కొంత మంది పెద్దలు పద్మశ్రీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పద్మశ్రీ బావగారు డాక్టర్ ముత్యాల భాస్కరరావు పద్మశ్రీకి అండగా నిలిచారు.

The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

*** అధ్యక్ష పదవికి నలుగురు పోటీ…
తానా అధ్యక్ష పదవికి పద్మశ్రీతో పాటు మరొక ముగ్గురు పోటీలోకి దిగారు. నాదెళ్ళ రణకుమార్, మంగరాజు, లాస్ఏంజిల్స్‌కు చెందిన శొంఠి కన్య అధ్యక్ష పదవికి రంగంలోకి దిగారు. నాదెళ్ళ గంగాధర్ రణకుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అప్పట్లో అమెరికావ్యాప్తంగా 10వేల మంది ఓటర్లు తానా సభ్యులుగా ఉండేవారు. హోరాహోరీగా ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో మొత్తం 7800 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 55 శాతం పద్మశ్రీకి వచ్చాయి. రెండవ స్థానంలో మంగరాజు, మూడవ స్థానంలో రణకుమార్, నాల్గవ స్థానంలో శొంఠి కన్య నిలిచారు.

The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

*** నాలుగు రికార్డులు నెలకొల్పిన పద్మశ్రీ
1999లో అప్పటీకే అమెరికాలో పెద్ద తెలుగు సంఘంగా ఆవిర్భవించిన తానాకు అధ్యక్షురాలిగా ఎన్నికైన పద్మశ్రీ ప్రవాసాంధ్రుల్లో ధృఢమైన మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆవిడ తానాలో సాధించిన రికార్డులు ఇవి. తానా చరిత్రలో అప్పటికీ, ఇప్పటికీ అధ్యక్ష పదవికి నలుగురు పోటీ చేయలేదు. అదొక రికార్డు కాగా రెండవది తానాలో అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ పద్మశ్రీ , మూడవది తానా చరిత్రలో ఎన్నికైన ఏకైక మహిళా అధ్యక్షురాలు కూడా పద్మశ్రీనే కావడం గమనార్హం. మరొక రికార్డు ఏమిటంటే తానా అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అతి పిన్నవయస్కురాలు అప్పటికీ ఇప్పటికీ పద్మశ్రీనే కావడం మరో రికార్డు. 2001లో ఫిలడల్ఫియాలో జరిగిన తానా మహాసభల్లో నాదెళ్ళ గంగాధర్ నుండి పద్మశ్రీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2003లో పద్మశ్రీ సారధ్యంలో శాన్‌హోశేలో జరిగిన తానా రజతోత్సవ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. కోమటి జయరాం సహకారంతో పద్మశ్రీ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

*** నాటి తానా బోర్డులో 17 మంది మాత్రమే ఉండేవారు.
ప్రస్తుతం తానా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సందర్భంగా ముత్యాల పద్మశ్రీ TNIకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను పని చేసిన సమయంలో 8 మంది రీజనల్ ఉపాధ్యక్షులు మాత్రమే ఉండేవారని వీరితో కలిపి తానా కార్యవర్గం 17 మంది మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం తానా రాజ్యాంగాన్ని సవరించి దాదాపు 40 మందికి పైగా కార్యవర్గ సభ్యులకు చోటు కల్పించారని పేర్కొన్నారు. తానా ఒక స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ వంటిదని దీని కార్యవర్గంలోకి వచ్చేవారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవలసి ఉంటుందని ఆమె తెలిపారు. తమ హయాంలో పూర్తి స్థాయిలో తానా అభివృద్ధికి, భాషాభివృద్ధికి, సేవా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకే పూర్తి సమయం కేటాయించామని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం తానా సంస్థను ఉపయోగించుకుటున్నారని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుతం సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా తానాలో ఇరు వర్గాలు తీవ్రంగా పోటీ పడటం దురదృష్టకరమని, ఎన్నికల అనంతరం అందరూ కలిసికట్టుగా ఉండి తానాను మరింత పటిష్టంగా చేద్దామని సభ్యులకు పద్మశ్రీ సూచించారు. తన భర్త ముత్యాల రాజ తానా ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో తాము తటస్థ వైఖరితో ఉన్నామని పద్మశ్రీ వెల్లడించారు.

The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

పద్మశ్రీ ఇప్పటివరకు తానాలో నిర్వహించిన పదవులు….

* 1983- 1989: తానాలో చురుకైన పాత్ర.
* 1989 – 1995: తానా సాంస్కృతిక కార్యక్రమాల అధ్యక్షురాలు
* 1997 – 1999: ప్రాంతీయ ప్రతినిధి
* 1999 – 2001: కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు
* 2001 – 2003: అధ్యక్షురాలు

The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri
The TANA Profile Of Mutyala Padmasri

— కిలారు ముద్దుకృష్ణ,
సీనియర్ జర్నలిస్ట్