Devotional

దుర్గగుడి ఈవోపై ఏసీబీ సంచలన నివేదిక-తాజావార్తలు

News Roundup - ACB Submits Report On Durga Temple EO To Govt

* విజయవాడ దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తేల్చింది. దుర్గగుడి కార్యకలాపాలపై ఇటీవల సోదాలు నిర్వహించిన ఏసీబీ.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో పాటు ఆడిట్‌ అభ్యంతరాలను బేఖాతరు చేసి ఈవో చెల్లింపులు చేసినట్లు స్పష్టం చేసింది. టెండర్లు, కొటేషన్లు, సామగ్రి కొనుగోళ్లలో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇచ్చిన సర్క్యులర్‌కు విరుద్ధంగా ఈవో చెల్లింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. శానిటరీ టెండర్లను నిబంధలనకు విరుద్ధంగా కేఎల్‌ టెక్నాలజీస్‌కు కట్టబెట్టారని.. ఇది సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ విషయంలో తక్కువ సొమ్ముకు కోట్‌ చేసిన స్పార్క్‌ సంస్థను పక్కన పెట్టారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.

* తెలంగాణా వచ్చాక లక్షా 30వేల ఉద్యోగాలు భర్తి చేశామని, రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టింది మొదలు మరణించే వరకు మనిషి నిరంతర విద్యార్థి అని అన్నారు. నేషనల్ లెవల్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ మోడల్ జిల్లా గ్రంథాలయం బాగా ఉపకరిస్తుందన్నారు. డిజిటల్ లైబ్రరీలో మొత్తం 13 కంప్యూటర్లు ఉన్నాయని, ఉచిత ఇంటర్నెట్‌తో వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిని నేషనల్ డిజిటల్ లైబ్రరీకి లింక్ చేశామని చెప్పారు.

* సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రాలేదని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.. అది ఏమైంది?.. ఆయా దళిత సామాజిక సంఘాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ప్రశ్నిస్తలేరని నిలదీశారు. జగజ్జీవన్‌రామ్‌, అంబేద్కర్‌ల స్పూర్తితో శక్తివంతమైన భారతదేశం కోసం పనిచేస్తామన్నారు. టీఆర్ఎస్ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుని.. ఆ డబ్బులతో రాజకీయాలు చేస్తోందని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.

* నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. పెద్దవూర మండలం, బోనూతుల, కుంకుడు చెట్టు తండా, చలకుర్తి గ్రామాల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, విప్ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే త్రిపురారంలో నోముల భగత్‌కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అనుముల మండలం, హాజరిగూడెం, నాయుడుపాలెం గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి పానుగోతు రవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అనుముల మండలం, శ్రీనాధపురం, చింతగూడెం, రామడుగు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

* కైతలాపూర్ విలీనమైన నగర శివారు మున్సిపాలిటీల్లో రూ.3,500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజి పునర్ఃనిర్మాణ పనులు చెప్పడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కైతలపూర్‌లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని, ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకండా ఆధునీకరణ ట్రాన్స్‌ఫర్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వర్షా కాలంలో ఇళ్లల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శివారు ప్రాంతాలకు నీటిని ఇస్తున్నామని, డ్రైనేజి సిస్టమ్‌ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని, మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కరోనా పూర్తిగా పోలేదని, మరోసారి లాక్‌డౌన్ రావద్దంటే అందరూ మాస్కలు తప్పనిసరిగా ధరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

* అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్ లో జరిగిన కార్యక్రమంలో తిరుమలగిరి మండలం చింతలపాలెం కు చెందిన ఐనబోయిన శ్రీనివాస్, రాము ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి 40 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వీరికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తోనే తమ సమస్యల పరిష్కారం జరుగుతుందనే పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారని, ఆ విశ్వాసం తోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ లు జాజుల సురేందర్ రెడ్డి, రవీంద్ర కుమార్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, సైదులు తదితరులు ఉన్నారు.

* తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అంతకంతకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే శనివారంతో పోల్చుకుంటే ఆదివారం పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 43,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,097 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,13,237కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,723కి చేరింది. నిన్న 268 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,458 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 302 కరోనా కేసులు నమోదయ్యాయి.

* తమిళనాట ఎన్నికల సమరాంగణానికి సర్వం సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి ఆదివారంతో తెరపడింది. మరో 24 గంటల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు. విజయంపై అటు అధికార అన్నాడీఎంకే, ఇటు ప్రతిపక్ష డీఎంకే ధీమాగా ఉన్నాయి. గెలుపు తమదంటే తమదంటూ ఆ పార్టీల నేతలు చెప్పుకొంటున్నారు. మరో విజయం ద్వారా అన్నాడీఎంకే హ్యాట్రిక్‌ సాధిస్తుందా? లేదంటే ప్రతిపక్ష డీఎంకే అధికారాన్ని దక్కించుకుంటుందా? కమల్‌హాసన్‌, దినకరన్‌ పార్టీల ప్రభావం ఎంతవరకు ఉంటుంది?… ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

* టీడీపీ అధినేత చంద్రబాబుకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు బహిష్కరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపును సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు..ఇప్పటికే పలువురు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. తాజాగా.. ఆయన సొంత నియోజకవర్గం లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండటం గమనార్హం..చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీ, 95 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఐదు జెడ్పీటీసీ, 90 ఎంపీటీసీ పదవులు ఏకగ్రీవమయ్యాయి..చంద్రగిరి మండలంలో జెడ్పీటీసీ, చంద్రబాబు సొంత ఊరు ఉన్న నారావారిపల్లితో పాటు మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఈ నెల 8న ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ఆదేశించడంపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు..లక్షలు ఖర్చు పెట్టుకుని, నెలల తరబడి ప్రచారం చేయగా.. పోలింగ్‌ సమీపిస్తున్న వేళ ఎన్నికల్ని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..చంద్రబాబు ఆదేశాలను పట్టించుకునేది లేదని తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లిలో స్వయంగా బంధువులే ఆయన ఆదేశాలను గాలికి వదిలేసి ఎంపీటీసీ అభ్యర్థి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.

* కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచిన ప్రభుత్వం, తాజాగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సాధ్యమైనంత తొందరగా ఎక్కువ మంది ప్రజలకు టీకా అందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

* ‘‘ఒక కాలికి దెబ్బతగిలితేనేం.. ఒంటికాలుతోనే బెంగాల్‌లో నెగ్గుతాం’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగాల్‌ రాయల్‌ టైగర్‌ అని పేర్కొన్న దీదీ.. రాష్ట్రాన్ని పాలించేది స్థానికులేనని ఆమె స్పష్టం చేశారు. గుజరాత్‌ వ్యక్తులు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ భాజపాపై విమర్శలు గుప్పించారు.

* రెండుసార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నా తనకు కరోనా వచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. తనకు కరోనా వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే అసలు జరిగింది వేరని వివరించారు.

* అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకుంటున్న వేళ, వాటి కొనుగోలుపై దుమారం మొదలైంది. వాటి కొనుగోలు సమయంలో రఫేల్‌ తయారీ సంస్థ ఓ మధ్యవర్తికి 1.1 మిలియన్‌ యూరోలను ‘కమీషన్‌’గా ఇచ్చినట్లు ఫ్రెంచ్‌ మీడియా కథనం పేర్కొనడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రఫేల్‌ ముడుపుల వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పడంతో పాటు, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

* నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి చాలా కీలకమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ అన్నారు. సాగర్‌ ఎన్నికను ఉప ఎన్నికగానే చూడొద్దని.. ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తిస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో మాణికం ఠాకూర్‌ జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశమయ్యారు.

* ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడి ఘటనలో జవాన్ల మృతి ఘటనపై ఏపీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీకి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఈ సందర్భంగా జగన్‌ పేర్కొన్నారు.

* అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఉద్యోగులపై శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎస్వీబీసీ ఎడిటర్‌ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఓ భక్తునికి అశ్లీల దృశ్యాల లింక్‌ పంపిన ఘటనలో ఇప్పటి వరకు 10 మందికి ఉద్వాసన పలికిన ఎస్వీబీసీ.. తాజాగా ఈ ముగ్గురికిపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు ఉన్నట్లు తితిదే సైబర్‌ సెక్యూరిటీ విజిలెన్స్‌ విభాగం గతంలో గుర్తించింది. ఈ క్రమంలో ఎస్వీబీసీ వారిపై చర్యలు తీసుకుంది.