WorldWonders

ఆస్ట్రిచ్ గుడ్డుతో 15ఆంలెట్‌లు

Ostrich Eggs And Their Omlettes Size Recipes

ఒక గుడ్డుతో ఒక ఆమ్లెట్ సాధారణమైన విషయం. అదే ఒక గుడ్డుతో 15 మందికి ఆమ్లెట్ వేయగలిగితే అది అసాధారణం అవుతుంది. అయితే ఆ గుడ్డు కోడిగుడ్డు కాదు… ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అయిన ఉష్ట్రపక్షి గుడ్డు. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఆస్ట్రిచ్ పక్షులు వాటి ఆకారానికి తగినట్టే గుడ్లను భారీ సైజులో పెడుతుంటాయి. ఒక గుడ్డు బరువు రెండు కిలోలు ఉంటుంది. దీన్ని పగలగొట్టడం అంత సులువైన విషయం కాదు. ఈ భారీ ఎగ్ ను ఉడకబెట్టాలంటే 90 నిమిషాలకు పైగా పడుతుందట. ఈ ఉష్ట్రపక్షి గుడ్డుతో ఆమ్లెట్ వేస్తే 15 మంది లాగించేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, లండన్ లోని ఓ రెస్టారెంట్లో ఉష్ట్రపక్షి గుడ్లతో ప్రత్యేక వంటకాలు తయారుచేస్తుంటారు. ఇవి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ఇందులో గుండె పనితీరును మెరుగుపరిచే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సెలీనియం, మాంగనీస్, జింక్ వంటి సూక్ష్మపోషకాలు కూడా మెండుగా ఉంటాయట. ఆస్ట్రిచ్ గా పిలుచుకునే ఈ ఉష్ట్రపక్షులు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తాయి. అటు శాకాహారం, ఇటు మాంసాహారం తినే ఈ పక్షి ఎగరలేదు. ఈ పక్షినే మనం నిప్పుకోడి అంటుంటాం. ఇవి చాలా బలమైనవి. గుంపులుగా జీవిస్తుంటాయి. ఈ పక్షి గుడ్లు, మాంసమే కాదు, చర్మానికి కూడా విపరీతమైన గిరాకీ ఉంది. వివిధ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో ఆస్ట్రిచ్ చర్మం వినియోగిస్తుంటారు.