Agriculture

ఏడాది పొడవునా మామిడి

ఏడాది పొడవునా మామిడి

ఏడాది పొడవునా మామిడి కాయలు కాసే కొత్త రకాన్ని రాజస్థాన్‌లోని కోటాకు చెందిన శ్రీకిషన్‌ సుమన్‌ అనే రైతు కనిపెట్టినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సదాబహార్‌ (సతతహరితం) పేరుతో రూపొందించిన ఈ పొట్టి రకం మామిడి సాధారణ తెగుళ్లు అన్నింటినీ తట్టుకుని ఏడాది పొడవునా కాపు ఇస్తుందని తెలిపింది. ‘‘ఉత్తర భారత్‌లో ఎక్కువగా లభించే లంగడా రకంతో పోలిస్తే ఈ పండు చాలా పొట్టిగా ఉంటుంది. పెరటి తోటల్లో, కుండీల్లో పెంచుకోవచ్చు. ముదురు కమలాపండు రంగులో కనిపించే దీని కండ భాగం చాలా తియ్యగా ఉంటుంది. పుష్కలమైన పోషకాలతో నిండిన ఈ మామిడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సరికొత్త మామిడిని కనుగొనడం వెనక పేదరికంలో పుట్టిపెరిగిన శ్రీకిషన్‌ మేధోసంపత్తి ఉంది. రెండో తరగతితో చదువు ఆపేసిన ఆయన 2000 సంవత్సరంలో తన తోటలోని ఓ మామిడి మొక్క మిగతా వాటికంటే భిన్నంగా ఏడాది పొడవునా కాయలు కాయడాన్ని గమనించారు. దానికి అయిదు అంట్లు కట్టి కొత్త రకాలు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించారు. అలా కట్టిన అంట్లను భద్రపరుస్తూ కొత్త రకం తయారుచేయడానికి ఆయనకు 15 ఏళ్లు పట్టింది. ఇలా అంటుకట్టిన మొక్క రెండో యేట నుంచే పండ్లు కాయడాన్ని గమనించారు. సదాబహార్‌పై నమ్మకం కుదరడంతో ఆ మొక్కను రాష్ట్రపతి భవన్‌లోని మొగల్‌ గార్డెన్‌లో నాటడానికి నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) చొరవ తీసుకుంది. శ్రీకిషన్‌ సుమన్‌కు 9వ నేషనల్‌ గ్రాస్‌రూట్‌ ఇన్నోవేషన్, ట్రెడిషనల్‌ నాలెడ్జ్‌ అవార్డు ఇచ్చింది. ఈ కొత్త రకం మామిడి కోసం 2017-20 మధ్యకాలంలో 8వేల ఆర్డర్లు వచ్చాయి. 2018-20 మధ్యకాలంలో శ్రీకిషన్‌ దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు 6వేల మొక్కలు సరఫరా చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలకు 500 మొక్కలు ఇచ్చారు. అలాగే 400 అంటు మొక్కలను వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు సరఫరా చేశారు’’ అని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ వివరించింది.