Business

పెరుగుదల బాటలోనే బంగారం ధరలు-వాణిజ్యం

Gold Prices On Rising Path In India

* బులియన్ మార్కెట్ లో ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్ లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయం బంగారు కొనుగోలుదారులకు చేదువార్త అని చెప్పుకోవాలి. నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,904 నుంచి రూ.46,152కు పెరిగింది. ఏప్రిల్ 1న రూ.44,228 ఉన్న బంగారం ధర నేడు రూ.46,152కు చేరుకుంది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,048 నుంచి 42,275కు పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.42650 నుంచి రూ.43000కు చేరుకుంది. నిన్నటి నుంచి ధర రూ.350 పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,530 నుంచి రూ.46,900కు పెరిగింది ఉంది. అంటే ఒక్కరోజులో రూ.370 రూపాయలు పెరిగింది అన్నమాట. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,139 నుంచి రూ.66,905కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది.

* తీవ్ర ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో క్రితం సెషన్‌లో భారీ లాభాలు గడించిన మార్కెట్లు.. ఈ ఉదయం కూడా అదే ఉత్సాహంతో మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లింది.

* పేమెంట్స్ బ్యాంక్‌ల‌లో వినియోగ‌దారుని డిపాజిట్ ప‌రిమితిని ఆర్‌బీఐ రెట్టింపు చేసింది.పేమెంట్స్ బ్యాంక్‌లు పొదుపు ఖాతాలు మ‌రియు చెల్లింపు సేవ‌ల ద్వారా మ‌రింత ఆర్ధిక ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికి ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల విస్త‌ర‌ణ పెంచ‌డానికి ఆర్‌బీఐ భార‌త్‌లో పేమెంట్స్ బ్యాంకుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.పేమెంట్స్ బ్యాంకులు చాలా కాలంగా డిపాజిట్ ప‌రిమితిని పెంచాల‌ని కోరుతున్నాయి. దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల బ్యాంకుల‌ను ప్రోత్స‌హించే ప్ర‌య‌త్నంలో, ఆర్‌బీఐ బుధవారం పేమెంట్స్ బ్యాంకుల గ‌రిష్ట డిపాజిట్స్‌ను రూ. 2 ల‌క్ష‌ల‌కు పెంచిన‌ట్లు ప్ర‌క‌టించింది. అంత‌కుముందు ఈ గ‌రిష్ట ప‌రిమితి రూ. 1 ల‌క్ష మాత్ర‌మే.న‌వంబ‌ర్ 27, 2014న జారీ చేయ‌బ‌డిన పేమెంట్స్ బ్యాంకుల లైసెన్సింగ్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఒక్కో వినియోగ‌దారుని గ‌రిష్ట బ్యాలెన్స్ రూ. 1 ల‌క్ష క‌లిగి ఉండ‌టానికి ఆర్‌బీఐ అనుమ‌తించింది. పేమెంట్స్ బ్యాంకుల ప‌నితీరుపై స‌మీక్ష ఆధారంగా మ‌రియు వారి ప్ర‌య‌త్నాల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో ఆర్థిక ల‌క్ష్యాల కోసం మ‌రియు ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, వ్యాపారుల‌తో స‌హా వారి వినియోగ‌దారుల అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల సామ‌ర్ధ్యాన్ని విస్త‌రించ‌డానికి కూడా గ‌రిష్ట ప‌రిమితిని రూ. 1 ల‌క్ష నుంచి రూ. 2 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని ఆర్‌బీఐ నిర్ణ‌యించింది.పేమెంట్స్ బ్యాంకుల ప్ర‌ధాన ల‌క్ష్యం వ‌ల‌స కార్మికులు, త‌క్కువ ఆదాయ గృహ‌స్తులు, చిన్న వ్యాపారులు, ఇత‌ర అసంఘ‌టిత రంగ సంస్థ‌లు, చిన్న పొదుపు ఖాతాల‌కు, చెల్లింపులు మ‌రియు ఆర్థిక సేవ‌ల‌ను అందించ‌డం.పేమెంట్స్ బ్యాంకుల‌ను ప్రారంభించ‌డానికి 2015 ఆగ‌స్టులో ఆర్‌బీఐ 11 సంస్థ‌ల‌కు సూత్ర‌ప్రాయంగా అనుమ‌తి ఇచ్చింది. దేశంలో పేమెంట్స్ బ్యాంకును ప్రారంభించిన మొద‌టిది ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) జ‌న‌వ‌రి 2017లో 2 పైల‌ట్ బ్రాంచ్‌ల‌లో కార్య‌క‌లాపాలు ప్రారంభించింది. ఇత‌ర పేమెంట్స్ బ్యాంకుల‌లో ప్ర‌ధాన‌మైన‌వి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మ‌రియు ఫినో పేమెంట్స్ బ్యాంక్‌.

* ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో వార్షిక ఇన్‌క‌మ్ ఫ్రూఫ్.. త‌ప్ప‌నిస‌రిగా బీమా సంస్థ‌లు కోర‌తాయి. ఆన్‌లైన్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన పాల‌సీల‌కు ఇన‌కమ్ ఫ్రూఫ్ ఇవ్వాల్సిందే. ఒక వ్య‌క్తికి ఎంత వ‌ర‌కు బీమా ఇవ్వ‌చ్చు అనే అంశాన్ని వార్షిక‌ ఆదాయం ఆధారంగానే నిర్ణ‌యిస్తాయి బీమా సంస్థ‌లు. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేసేవారు ఇన్‌క‌మ్ ఫ్రూవ్ సిద్దంగా ఉంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

* రిలయన్స్ జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త అందించింది. జియోఫైబర్ యూజర్లు నెల నెల ప్లాన్ కాకుండా వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకుంటే అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు పేర్కొంది. జియోఫైబర్ వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరునెలల ప్యాకేజీపై 15 రోజులు అదనంగా అందిస్తోంది. జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788(నెలకు రూ.399 రూపాయల బేస్ ప్లాన్ కోసం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్న కానీ, వార్షిక ప్లాన్ కు అప్ గ్రేడ్ అయిన వ్యాలిడిటీ 395 రోజులకు పెరగనుంది. అలాగే ఆరు నెలల ప్లాన్లపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్లకు వర్తించనుంది.

* గత ఆరేళ్లలో బ్యాంక్‌లు, వివిధ ఆర్థిక సంస్థలు ఉమ్మడిగా రూ.15 లక్షల కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 28.68 కోట్ల లబ్ధిదారులకు ఈ రుణాల పంపిణీ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21లో రూ.4.20 కోట్ల పీఎంఎంవై రుణాలు మంజూరయ్యాయి. రుణాల సగటు పరిమాణం రూ.52 వేలుగా ఉంది. దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్ షిప్‌ను ప్రోత్సహించేందుకు 2015 ఏప్రిల్‌ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.